భారత్లో కరోనా మహమ్మారి తీవ్రరూపు దాల్చిన సంగతి తెలిసిందే. కరోనా వైరస్ సునామీలో భారత్ లోని పలు రాష్ట్రాలు కొట్టుమిట్టాడుతున్నాయి. గడచిన 24 గంటల్లో మన దేశంలో 3,82,315 కరోనా కేసులు నమోదవడం కలవరపెడుతోంది. దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,06,65,148కు చేరడం ఆందోళన కలిగిస్తోంది. గత 24 గంటల్లో 3,780 మంది కరోనాతో మృతి చెందగా మొత్తం సంఖ్య 2,26,188 కు పెరిగింది.
లాక్ డౌన్ పై ఆయా రాష్ట్రాలు నిర్ణయం తీసుకోవాలని ప్రధాని మోడీ ఇప్పటికే వెల్లడించిన సంగతి తెలిసిందే. అయితే, దేశవ్యాప్త లాక్ డౌన్ విధిస్తేనే కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట వేయగలమని పలువురు నిపుణులు సూచిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ రోజు ఉదయం 11 గంటలకు వర్చువల్ విధానంలో ప్రధాని మోడీ అధ్యక్షతన జరుగుతోన్న కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశమున్నట్లు తెలుస్తోంది.
వివిధ రాష్ట్రాల్లో వైరస్ వ్యాప్తి పరిస్థితులపై ప్రధాని సమీక్ష నిర్వహించి నిర్ణయం తీసుకోనున్నారని తెలుస్తోంది. ఆసుపత్రుల్లో పడకలు, ఆక్సిజన్, టీకాలు, అవసరమైన ఔషధాల లభ్యత వంటి తదితర ముఖ్యమైన అంశాలపై కూడా చర్చించనున్నారు. మరోవైపు ఇప్పటికే ఒడిశా సహా పలు రాష్ట్రాలు లాక్ డౌన్ ను ప్రకటించాయి. దీంతో మిగతా రాష్ట్రాల్లోనూ లాక్ డౌన్ విధించడంపై కేంద్ర ప్రభుత్వం ఆలోచనలో పడ్డట్లు తెలుస్తోంది.
కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో లాక్ డౌన్ పెట్టి, మిగిలిన ప్రాంతాల్లో పాక్షిక లాక్ డౌన్ విధించే అవకాశముందని తెలుస్తోంది. మరి, మోడీ సర్కార్ లాక్ డౌన్ పై ఏ నిర్ణయం తీసుకుంటారో అన్నదానిపై సర్వత్రా ఉత్కంఠ ఏర్పడింది.