ప్రముఖ నటి సీత గురించి పరిచయాలు అక్కర్లేదు. కెరీర్ ఆరంభంలో తెలుగు, తమిళ భాషల్లో హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన సీత.. ఆ తర్వాతి కాలంలో సహాయక నటిగా మారారు. ప్రస్తుతం సినిమాల్లోనూ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రాణిస్తూనే.. మరోవైపు సీరియల్స్ లో కూడా యాక్ట్ చేస్తున్నారు. పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే.. సీత రెండు వివాహాలు చేసుకున్నారు. ఆమె మొదటి భర్త మరెవరో కాదు ఆర్. పార్థిబన్. ఈయన తమిళులకు అత్యంత సుప్రసిద్ధుడు.
1984 లో కె. భాగ్యరాజ్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా తన కెరీర్ ప్రారంభించిన పార్థిబన్.. వందకు పైగా చిత్రాల్లో నటించారు. 16 చిత్రాలకు డైరెక్టర్ గా, 14 చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించారు. రచయితగా, గాయకుడిగానూ గుర్తింపు సంపాదించుకున్నారు. పార్థిబన్ డైరెక్ట్ చేసిన చిత్రం `పుదియా పాడై`. 1989లో రిలీజ్ అయిన ఈ మూవీ సంచలన విజయాన్ని నమోదు చేయడంతో పాటు ఉత్తమ తమిళ చిత్రంగా జాతీయ అవార్డును అందుకుంది. ఈ పుదీయా పాడైలో సీత మెయిన్ లీడ్‌గా యాక్ట్ చేశారు. అప్పుడు పార్థిబన్, సీత మధ్య పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమగా మారడంతో.. 1990లో ఇరువురు వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు అభినయ, కీర్తన అనే ఇద్దరు కూతుళ్లతో పాటు రాఖీ అనే ఒక దత్త కుమారుడు కూడా ఉన్నారు.
వివాహం అనంతరం కొన్నాళ్లకు వెండితెరపై దూరమైన సీత.. మళ్లీ తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు. 2001లో పరస్పర అంగీకారంతో పార్థిబన్, సీత విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత సీరియల్ నటుడు సతీష్ ను సీత రెండో వివాహం చేసుకోగా.. వీరి బంధం కూడా ఎక్కువ కాలం నిలవలేదు. అయితే సీతతో విడాకులై 24 ఏళ్లైనా పార్థిబన్ మాత్రం ఇంకా ఒంటిరి జీవితాన్నే గడుపుతున్నారు. ఈ విషయంపై ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన పార్థిబన్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
`నేను, సీత ప్రేమించే పెళ్లి చేసుకున్నాం. కానీ కొన్ని కారణాల వల్ల విడిపోయాం. ఆ సమయంలోనే మేము కలిసున్న ఇంటిని అమ్మేశాము. ఆ తర్వాత నేను సొంత ఇల్లు కొనుక్కోలేకపోయాను. అద్దె ఇంట్లోనే ఉంటున్నాను. సీతకు విడాకులిచ్చి 24 ఏళ్లైనా మళ్లీ పెళ్లి చేసుకోలేదు. నా భార్యగా సీతకు స్థానమిచ్చారు. దాన్ని మరొకరికి ఇవ్వలేను. ఇప్పటికీ సీతను ప్రేమిస్తాను, గౌరవిస్తాను. ఇద్దరు కూతుళ్లకు పెళ్లిళ్లు అయిపోయాను. ప్రస్తుతం నేను, నా కొడుకు సింగిల్ గా ఉంటున్నాము. సీతతో ఇప్పుడు టచ్ లో లేను. కానీ ఆమె తల్లి చనిపోయినప్పటికీ అన్ని కార్యక్రమాలు నేనే దగ్గరుండి జరిపించాను` అంటూ పార్థిబన్ చెప్పుకొచ్చారు.