ఏపీలో 2024 సార్వత్రిక ఎన్నికల తర్వాత.. వైసీపీ ఘోరంగా పరాభవాన్ని ఎదుర్కొంటోంది. అనేక మంది నాయకులు పార్టీకి రాం.. రాం.. చెప్పి బయటకు వచ్చారు. వీరిలో జగన్ కు దూరపు బంధువులు కూడా ఉన్నారు. వారంతా పార్టీని ఒకప్పుడు తమ భుజాలపై మోసిన వారే.. నడిపించిన వారే.. నమ్మకంగా ఉన్నవారే. అయినా.. వారు కాదనుకుని బయటకు వచ్చారు. వీరిలో బాలినేని శ్రీనివాసరెడ్డి, వి. విజయసాయిరెడ్డి, మోపిదేవి వెంకటరమణ, జంగా కృష్ణమూర్తి, పోతుల సునీత, ఆళ్ల నాని, అవంతి శ్రీనివాసరావు.. ఇలా.. అనేక మంది బలమైన సామాజిక నేపథ్యం ఉన్న నాయకులే కావడం గమనార్హం.
నిజానికి వీరంతా “జగనన్న“ అంటూ.. అప్పట్లో వైసీపీకి బలమైన మద్దతు ప్రకటించిన వారే. తమ తమ పరిధిలో పార్టీకి సేవలు అందించిన వారే. అయితే.. కాదనుకుని బయటకు వచ్చారు. కానీ, వారికి జరగిన అవమానాలను మాత్రం ఎంత మరిచిపోవాల ని అనుకున్నా.. మరుపురాని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. వాస్తవానికి రాజకీయాల్లో పార్టీల అధినేత తప్ప.. నాయకులు మారుతూనే ఉంటారు. ఎక్కడో కొందరు మాత్రమే పార్టీలను అంటిపెట్టుకుంటున్నారు. మిగిలిన చాలా మంది నాయకులు అవకాశం చూసుకుని అటు-ఇటు మారిన వారే.
అయితే.. ఎవరూ వీరిలాగా(వైసీపీ నుంచి బయటకు వచ్చినవారు) మాత్రం బాధపడడం లేదు. రెండు రోజుల కిందట బాలినేని శ్రీనివాసరావు.. జనసేన ఆవిర్భావ సభలో మాట్లాడినా.. ఒక రోజు కిందట సాయిరెడ్డి సుదీర్ఘ ట్వీట్ చేసినా.. ఆళ్ల నాని తన అనుచరులతో పెట్టిన సభలో ఆందోళన వ్యక్తం చేసినా.. అందరి బాధా.. ఒక్కటే. వైసీపీలో జరిగిన అవమానాల కలబోతే. కోటరీ ఉందని.. దాని వల్లే నాయకులు, పార్టీ కూడా నాశనం అయిపోతోందని సాయిరెడ్డి కుండబద్దలు కొట్టారు. ఇక, బాలినేని ఏకంగా.. జగన్పై విమర్శలు చేశారు. తన ఆస్తులు కూడా గుంజుకున్నారని చెప్పారు.
ఆళ్ల నాని అయితే.. తాను మంత్రిననే కానీ.. తాను ఏ నాడూ అలా ఫీలయ్యే పరిస్థితి లేకుండా `ఓ వ్యక్తి` చేశాడని అనుచరుల వద్ద వాపోయారు. ఇక, అవంతి శ్రీనివాస్ కూడా.. తాను మంత్రిగా ఉన్నా.. ఏనాడూ చొరవ లేదన్నారు. మరికొందరు నాయకు లు కూడా ఇలానే వాపోయారు. ఇలా.. ఒక పార్టీపై ఎప్పుడూ గతంలో ఫిర్యాదులు వచ్చిన పరిస్థితి కానీ.. వ్యక్తిగత విమర్శలు చేసిన నాయకులు కానీ లేకపోవడం గమనార్హం. దీనిని బట్టి.. వైసీపీలో ఉన్న నాయకులు ఎంత మనోవేదన అనుభవిస్తున్నార న్నది అర్థమవుతోందని అంటున్నారు రాజకీయ వర్గాలు. పరిస్థితి ఇలానే ఉంటే.. వైసీపీలో ఆ ఇద్దరుముగ్గురు రెడ్లు తప్ప.. మిగిలిన వారు బయటకు వచ్చేసే పరిస్థితి ఉంటుందని హెచ్చరిస్తున్నారు.+