టాలీవుడ్ యూత్ ఫుల్ స్టార్ నితిన్ త్వరలో `రాబిన్ హుడ్` మూవీతో ప్రేక్షకులను పలకరించబోతున్న సంగతి తెలిసిందే. భీష్మ వంటి సూపర్ హిట్ అనంతరం డైరెక్టర్ వెంకీ కుడుముల, నితిన్ కాంబోలో వస్తున్న రెండో చిత్రమిది. శ్రీలీల హీరోయిన్ కాగా.. ప్రముఖ స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ కీలక పాత్రలో నటించారు. కేతిక శర్మ ఓ స్పెషల్ సాంగ్ లో అలరించబోతుంది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మితమైన రాబిన్ హుడ్ మార్చి 28న గ్రాండ్ రిలీజ్ కాబోతోంది.
ఈ నేపథ్యంలోనే చిత్రబృందం జోరుగా ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తోంది. చాలా కాలం నుంచి సరైన హిట్ లేక సతమతం అవుతున్న నితిన్.. రాబిన్ హుడ్తో మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కాలని భావిస్తున్నారు. మరోవైపు యంగ్ బ్యూటీ శ్రీలీల కెరీర్ కు కూడా ఈ హిట్ కీలకంగా ఉంది. ఇదిలా ఉంటే.. ప్రమోషన్స్ లో భాగంగా నితిన్ విజయవాడలో మీడియాతో ముచ్చటించాడు. సినిమాకు సంబంధించి అనేక విశేషాలను పంచుకున్నారు.
అయితే ఈ క్రమంలోనే ఓ రిపోర్టర్ పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చే ఆలోచన ఏమైనా ఉందా? అంటూ ప్రశ్నించారు. అందుకు నితిన్.. సినిమాల్లో హాపీగా ఉన్నానని, పాలిటిక్స్ లోకి వచ్చే ఆలోచన తనకు లేదని బదులిచ్చాడు. కాగా, రాబిన్ హుడ్పై హైప్ పెంచేందుకు తెలంగాణతో పాటు ఏపీలోనూ నితిన్ విసృతంగా పర్యటిస్తున్నాడు. తాజాగా శ్రీలీలతో కలిసి నితిన్ రాజమండ్రిలోని ఐఎస్టీఎస్ కాలేజీకి వెళ్లారు. అక్కడి స్టూడెంట్స్తో సరదాగా మాట్లాడటమే కాకుండా నితిన్, శ్రీలీల వారితో డ్యాన్స్ కూడా చేశారు.