జగన్ హయాంలో పెండింగ్ బిల్లుల వ్యవహారం రచ్చ లేపిన సంగతి తెలిసిందే. సొంత పార్టీ నేతలకు కూడా బిల్లులు చెల్లించకపోవడంతో జగన్ పై వారు గుర్రుగా ఉన్నారు. అయితే, సీఎంగా చంద్రబాబు పగ్గాలు చేపట్టిన తర్వాత పరిస్థితి మారింది. ఈ క్రమంలోనే పెండింగ్ బిల్లులపై చంద్రబాబు తీపి కబురు చెప్పారు.
విద్యార్థులు, పోలీసులు, ఉద్యోగులు, చిరు కాంట్రాక్టర్లకు పెండింగ్ బిల్లులు చెల్లించాలని చంద్రబాబు నిర్ణయించారు.
సంక్రాంతి పండుగ నేపథ్యంలో అత్యవసర ఆర్థిక శాఖ సమీక్ష సందర్భంగా చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆ భేటీ తర్వాత పయ్యావుల కీలక విషయాలు వెల్లడించారు. ఖజానాలో ఉన్న నిధులు చెల్లిస్తే ఆర్థిక ఇబ్బందులు వస్తాయని చెప్పినా పెండింగ్ బిల్లులు చెల్లించాలని చంద్రబాబు ఆదేశించారని పయ్యావుల చెప్పారు. రూ. 6700 కోట్ల పెండింగ్ బిల్లులు చెల్లించాలని ఆదేశించారని తెలిపారు.
ఉద్యోగులకు జీపీఎఫ్ కింద రూ.519 కోట్లు, పోలీసులకు సరెండర్ లీవ్ బకాయిల్లో ఒక ఇన్ స్టాల్ మెంట్ కింద రూ. 214 కోట్లు, సీపీఎస్ కు సంబంధించిన రూ. 300 కోట్లు, టీడీఎస్ కింద రూ. 265 కోట్లు..ఇలా ఉద్యోగులకు మొత్తంగా రూ. 1,300 కోట్లు విడుదల చేస్తున్నామన్నారు. ఆరున్నర లక్షల మంది విద్యార్థులకు ఫీజ్ రీయింబర్స్ మెంట్ బకాయిలు రూ.788 కోట్లు విడుదల చేస్తున్నామని చెప్పారు. చిరు కాంట్రాక్టర్లు రూ. 10 లక్షల లోపు బిల్లులు ఉన్న 26 వేల మందికి లబ్ధి చేకూరేలా రూ.586 కోట్లు విడుదల చేస్తున్నమన్నారు. అమరావతి రైతులకు కౌలు బకాయిలు రూ. 241 కోట్లు చెల్లిస్తున్నమని చెప్పారు.