వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా తిరుమల వెంకన్న దర్శనం కోసం టోకెన్లు జారీ చేస్తున్న సమయంలో తొక్కిసలాట ఘటన జరిగిన సంగతి తెలిసిందే. ఆ తొక్కిసలాటలో ఆరుగురు భక్తులు మృతి చెందగా, మరో 40 మంది గాయపడ్డారు. ఈ క్రమంలోనే మృతుల కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి రూ.25 లక్షల చొప్పున టీటీడీ పరిహారం ప్రకటించింది. తీవ్రంగా గాయపడిన బాధితులకు రూ.5 లక్షలు, గాయపడిన బాధితులకు రూ.2 లక్షలు చొప్పున పరిహారం ప్రకటించింది. ఈ క్రమంలోనే గాయపడిన బాధితులలో కొందరికి టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, టీటీడీ సభ్యులు నేడు నష్టపరిహారం చెక్కులు పంపిణీ చేశారు.
స్విమ్స్ డైరెక్టర్ ఛాంబర్ నందు ఈ చెక్కులను అందజేశారు. అన్నమయ్య జిల్లా రామసముద్రం మండలం నరసాపురం గ్రామానికి చెందిన తిమ్మక్కకు రూ.5 లక్షలు, విశాఖపట్నం జిల్లా గోపాలపట్నంకు చెందిన పీ ఈశ్వరమ్మకు రూ.5 లక్షల చొప్పున అందజేశారు. గాయపడిన మరో ఐదుగురికి రెండు లక్షల చొప్పున పరిహారం అందజేశారు.
మృతి చెందిన ఆరుగురి కుటుంబాలకు పరిహారం చెల్లించేందుకు టీటీడీ పాలకమండలి సభ్యులతో 2 కమిటీలను ఏర్పాటు చేశామని బీఆర్ నాయుడు తెలిపారు. విశాఖ, నర్సీపట్నం ప్రాంతాల్లోని బాధిత కుటుంబాల దగ్గరకు వెళ్లే బృందంలో బోర్డు సభ్యులు జ్యోతుల నెహ్రూ, జంగా కృష్ణమూర్తి, పనబాక లక్ష్మి, జానకీ దేవి, మహేందర్ రెడ్డి, ఎంఎస్ రాజు, జీ భానుప్రకాశ్ రెడ్డి ఉన్నారని అన్నారు. తమిళనాడు, కేరళ సరిహద్దులోని బాధిత కుటుంబాలకు పరిహారం అందజేసే కమిటీలో రామమూర్తి, కృష్ణమూర్తి, వైద్య నాథన్, నరేశ్ కుమార్, శాంతారామ్, సుచిత్రా ఎల్లా ఉన్నారని తెలిపారు.