కడప నగరపాలక సంస్థ సర్వ సభ్య సమావేశంలో హై టెన్షన్ ఏర్పడింది. సమావేశం ప్రారంభం కాకముందే ఎమ్మెల్యే మాధవీ రెడ్డి, మేయర్ సురేశ్ బాబు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. సోమవారం ఉదయం 11 గంటలకు కడప మున్సిపల్ కార్పొరేషన్ సర్వసభ్య సమావేశం ప్రారంభం కాగా.. ఎమ్మెల్యే మాధవి రెడ్డి కూడా సమావేశానికి హాజరు అయ్యారు. అయితే గత వైకాపా ప్రభుత్వంలో ఎమ్మెల్యేకు వేదికపై కుర్చీ ఏర్పాటు చేసిన మేయర్.. ఇప్పుడు కుర్చీ వేయకపోవడంతో రచ్చ మొదలైంది. ఈ విషయంలో మేయర్ పై ఎమ్మెల్యే మాధవీ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
మహిళలంటే వైసీపీ నేతలకు చిన్నచూపు అని మాధవీ రెడ్డి మండిపడ్డారు. మహిళలను అవమానిస్తే.. వాళ్ల నాయకుడు సంతోషిస్తాడో, లేక మేయర్ కార్పొరేటర్ల కుర్చీలు తీసివేస్తారేమో అన్న భయం పట్టుకుందో తెలియదుగానీ కుర్చీలాట మొదలెట్టారని విమర్శించారు. ఇక్కడ కుర్చీ మీరు లాగేసినా ప్రజలు తనకు కుర్చీ ఇచ్చారని.. సమావేశమంతా నిల్చొని మాట్లాడే శక్తి తనకుందని మాధవీ రెడ్డి వ్యాఖ్యనించారు. విచక్షణాధికారం ఉందని మేయర్ విచక్షణ లేకుండా ప్రవర్తిస్తున్నారని ఎమ్మెల్యే చురకలు వేశారు.
ఈ క్రమంలోనే ఎమ్మెల్యే మాధవీ రెడ్డికి మద్దతుగా టీడీపీ కార్పొరేటర్లు మేయర్ పోడియం దగ్గర నిరసనకు చేశారు. మేయర్ డౌన్ డౌన్ అంటూ టీడీపీ కార్పొరేటర్లు నినాదాలు చేయడంతో.. పోటీగా వైసీపీ కార్పొరేటర్లు కూడా ఆందోళనకు దిగారు. అటు టీడీపీ, వైసీపీ కార్పొరేటర్ల మధ్య తోపులాట జరిగింది. సమావేశం రసాభాసగా మారడంతో.. ఎలాంటి ఉద్రిక్తతలు జరగకుండా పోలీసులు వారిని అడ్డుకున్నారు. కడప కార్పొరేషన్ పరిధిలో 144 సెక్షన్ విధించారు. మొత్తానికి కడపలో కుర్చీ రాజకీయం కాక రేపుతోంది. కడప రెడ్డమ్మగా పేరు తెచ్చుకున్న మాధవీ రెడ్డి ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. కాగా, ఇటీవల వైసీపీ నుంచి ఏడుగురు కార్పొరేటర్లు టీడీపీలోకి వెళ్లిన సంగతి తెలిసిందే. ఆయిలే ఆ ఏడుగురిని తాజాగా మేయర్ సస్పెండ్ చేశారు.