ఏపీ సీఎం చంద్రబాబు, మాజీ సీఎం జగన్.. ఇద్దరూ కూడా ఉప్పు – నిప్పు టైపు అనే విషయం తెలిసిందే. రాజకీయంగానేకాదు.. వ్యక్తిగతంగా కూడా.. చంద్రబాబు వర్సెస్ జగన్‌ల మధ్య మాటల మంటలు మామూ లుగా ఉండవు. అలాంటి నాయకుల మధ్య `శుభాకాంక్షలు` చోటు చేసుకున్నాయి. శనివారం వైసీపీ అధినేత జగన్ 53వ పుట్టిన రోజు. దీనిని పురస్కరించుకుని సీఎం చంద్రబాబు.. ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.
“పుట్టిన రోజు సందర్భంగా జగన్‌కు హృదయపూర్వక శుభాకాంక్షలు. ఆయనకు సంపూర్ణ ఆయురారో గ్యాలు భగవంతుడు ప్రసాదించాలని ఆకాంక్షిస్తున్నా“ అని చంద్రబాబు ఎక్స్‌లో పోస్టు చేశారు. అయితే.. వాస్తవానికి ఇదే చంద్రబాబు పుట్టిన రోజు ఏప్రిల్-20న కానీ, ఏనాడూ జగన్ సానుకూలంగా పోస్టు చేసింది లేదు. పైగా.. 420 అంటూ.. అసెంబ్లీలోనే వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కానీ, చంద్రబాబు మాత్రం.. తన విజ్ఞతను తగ్గించుకోకుండా.. జగన్‌కు మనస్పూర్తిగా శుభాకాంక్షలు చెప్పడం గమనార్హం.
రాజకీయంగా విభేదించుకున్నప్పటికీ.. చంద్రబాబు మాత్రం తన ఆశీస్సులు అందించడం పట్ల.. జగన్ అభిమానులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. నిజానికి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాం నుంచి కూడా.. చంద్రబాబు.. వైఎస్‌కు శుభాకాంక్షలు చెప్పేవారు. బాబుకు వైఎస్ కూడా.. కేక్ పింపించేవారు. తర్వాత.. జగన్ హయాంలో ఇరు పక్షాల మధ్య వ్యక్తిగత అంశాలు..(ముసలాయన, సైకో వంటి పదాలు) చోటు చేసుకున్నాయి. అయినప్పటికీ చంద్రబాబు తన విజ్ఞతను ప్రదర్శించి.. తనకన్నా 20 ఏళ్లకు పైగా చిన్నవాడైన జగన్‌ను ఆశీర్వదించడం గమనార్హం.