ఇటీవల కాలంలో అభిమానుల అత్యుత్సాహం కారణంగా సినీ తారలు ఎంతలా ఇబ్బంది పడుతున్నారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మొన్న జరిగిన అల్లు అర్జున్ ఇష్యూ ఇందుకు ఒక ఉదాహరణ. ఇదే తరుణంలో జనసేన పార్టీ అధ్యక్షుడు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తాజాగా తన ఫ్యాన్స్ కి స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. ప్రస్తుతం పవన్ ఉత్తరాంధ్ర పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. శుక్రవారం పార్వతీపురం జిల్లాలోని గిరిజన ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణానికి పవన్ శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. `అభిమానులు చూపించే ప్రేమ ఎప్పుడు నా గుండెల్లో ఉంటుంది. అభిమానులు తిరిగి నేను కోరేది ఒక్కటే.. నా పని నన్ను చేసుకోనివ్వండి. ప్రజా సమస్యలను తెలుసుకుని వాటిని పరిష్కరించడం నా బాధ్యత. కానీ నేను బయటకు వచ్చినప్పుడల్లా మీరు నా మీద పడిపోతే నేను పనేలా చేయాలి. రోడ్ల పరిస్థితి ఏంటో చూద్దామని వస్తే.. రోడ్లు కూడా కనిపించకుండా గుమిగూడుతున్నారు. మీ అందరికీ దండం పెడతాను.. దయచేసి నన్ను పని చేసుకోనివ్వండి. నేను పని చేస్తేనే మీ భవిష్యత్తు బాగుంటుంది` అంటూ పవన్ సున్నితంగా వార్నింగ్ ఇచ్చారు.
అలాగే ఇంకా మాట్లాడుతూ.. ఒకప్పుడు సీఎం సీఎం అని అరిచేవారు. డిప్యూటీ సీఎం అయ్యాను. ఇప్పుడు ఓజీ ఓజీ అంటూ పోస్టర్లు పెట్టి నానా హంగామా చేస్తున్నారు. సినిమాలు, హీరోల మోజులో పడి మీ జీవితంలో బాధ్యతలు మర్చిపోతున్నారు. అభిమాన నటులకు జేజేలు కొట్టండి కానీ బాధ్యతలు మరిచిపోవద్దు. మాట్లాడితే మీసం తిప్పండన్నా అంటారు.. ఈ రోజుల్లో మీసం తిప్పితేనో, ఛాతీ చూపిస్తేనో పనులు జరగవు. ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి దృష్టికి మన సమస్యలను తీసుకెళ్తే పనులు జరుగుతాయి. మీసాలు తిప్పడాలు, ఛాతీలు కొట్టుకోవడాలు నాకు చేతకావు.. పని చేయడం మాత్రమే నాకు తెలుసు. కాబట్టి నేను చెప్పేది ఒక్కటే.. నేను వచ్చినప్పుడు నా చుట్టు గుమిగూడకుండా నా పనులకు సహకరించండి అని పవన్ కళ్యాణ్ తన అభిమానులకు హితబోధ చేశారు.