అధికారాన్ని అడ్డుపెట్టుకుని గత ఐదేళ్లు అడ్డగోలుగా వ్యవహరించడమే కాకుండా ప్రతిపక్ష పార్టీ నాయకులను నానా ఇబ్బందులకు గురి చేసిన వైసీపీ నాయకులు.. అధికారాన్ని కోల్పోగానే పక్కచూపులు చూస్తున్నారు. వైసీపీకి రాజీనామా చేసేసి కూటమి పార్టీల్లోకి దూరేస్తున్నారు. ఈ జాబితాలో మాజీ మంత్రి, వైసీపీ కీలక నేత జోగి రమేష్ కూడా చేరబోతున్నారని ప్రస్తుతం జోరుగా ప్రచారం జరుగుతోంది. కొంత కాలం నుంచి వైసీపీలో యాక్టివ్ పాలిటిక్స్ కు దూరంగా ఉంటున్న జోగి రమేష్.. త్వరలోనే టీడీపీలో చేరబోతున్నట్లు సంకేతాలు ఇస్తున్నారు.
ఇటీవల నూజివీడు బస్టాండు సెంటర్లో గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. మంత్రి పార్థసారధి, పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష లచ్చన్న విగ్రహాన్ని ఆవిష్కరించారు. అయితే ఈ కార్యక్రమానికి వైసీపీ నేత జోగి రమేష్ హాజరు కావడం చర్చనీయాంశం అయింది. అంతేకాకుండా నూజివీడు పురపాలక పరిధిలో జరిగిన ర్యాలీలో కూడా మంత్రి పార్థసారధి, గౌతు శిరీషలతో కలిసి జోగి రామేష్ పాల్గొన్నారు.
గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణలో పాల్గొనటం, టీడీపీ నేతలతో యాక్టివ్ గా ఉండటంతో జోగి రమేష్ త్వరలో వైసీపీని వీడటం ఖాయమనే వార్తలు ఊపందుకున్నాయి. అయితే ఈ విషయంపై తెలుగు తమ్ముళ్లు భగ్గుమంటున్నారు. వైసీపీ హాయంలో చంద్రబాబు ఇంటిపై జరిగిన దాడి ఘటనలో కీలకంగా ఉన్న వ్యక్తి, ఐదేళ్ల పాటు పార్టీ కేడర్‌ను కేసులతో వేధించిన వ్యక్తి జోగి రమేష్.. అతనితో ఇప్పుడు మంత్రి పార్థసారధి, ఎమ్మెల్యే గౌతు శిరీష కలిసి తిరగడం సరికాదంటూ హితవు పలుకుతున్నారు. జోగి రమేష్ టీడీపీలో చేరడాన్ని తెలుగు తమ్ముళ్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
నూజివీడు పట్టణం బస్టాండ్ వద్ద ఏర్పాటు చేసిన డాక్టర్ #సర్ధార్_గౌతు_లచ్చన్న గారి కాంస్య విగ్రహా ఆవిష్కరణ వేడుకలలో పాల్గొన్న
మాజీ మంత్రివర్యులు మరియు మైలవరం నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త
శ్రీ #జోగి_రమేష్ గారు pic.twitter.com/a9NtC7tjPt— Jogi Ramesh (@JogiRameshYSRCP) December 16, 2024