. ఎమ్మెల్యే సీటు త్యాగం చేసిన జనసేనను గెలిపించిన వైనం
. ఎలాంటి పదవి లేకుండా ఇన్చార్జ్ హోదాలో 50 వేల సభ్యత్వాలు పూర్తి
. ఏలూరు జిల్లా అధ్యక్ష హోదాలో పార్టీ బలోపేతం
ఏలూరు జిల్లా టీడీపీ అధ్యక్షులు.. ఉంగుటూరు మాజీ ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు నాలుగు దశాబ్దాల తెలుగుదేశం పార్టీ చరిత్రలో సరికొత్త రికార్డు క్రియేట్ చేశారు. పార్టీలో ఇది నెవ్వర్ బిఫోర్ రికార్డుగా చరిత్రలోకి ఎక్కింది. తాజాగా తెలుగుదేశం పార్టీ సభ్యత్వాల నమోదు ప్రక్రియ కొనసాగుతోంది. పార్టీ 2024 ఎన్నికల్లో కూటమి కట్టి అధికారంలోకి రావడంతో ఈ సారి సభ్యత్వ నమోదు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. చంద్రబాబుతో పాటు యువనేత లోకేష్ చాలా ప్రెస్టేజ్‌గా సభ్యత్వ నమోదు తీసుకున్నారు.
రాష్ట్ర స్థాయిలో పార్టీ ఎమ్మెల్యే లేని చోట ఏకంగా 50 వేలకు పైగా సభ్యత్వాలు నమోదు కావడం పార్టీ చరిత్రలోనే ఆల్ టైం రికార్డుగా నిలిచిపోయింది. ఉంగుటూరు నియోజకవర్గంలో నియోజకవర్గ కేంద్రమైన ఉంగుటూరుతో పాటు భీమడోలు, నిడమర్రు, గణపవరం మండలాలు ఉన్నాయి. ప్రతి మండలంలోనూ 10 వేలకు తగ్గకుండా సభ్యత్వాలు నమోదు కావడం రికార్డుగా నిలిచింది. గన్ని పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ఏలూరు జిల్లా పార్టీ అధ్యక్ష పగ్గాలు చేపట్టి తన జిల్లా పరిధిలో పార్టీని తిరుగులేని విధంగా పటిష్టం చేయడంలో తన వంతో రోల్ ప్లే చేశారు. ప్రతి రోజు తన నియోజకవర్గమో లేదా.. తన జిల్లా పరిధిలో ఏదో ఒక పార్టీ కార్యక్రమం ద్వారా పార్టీ కేడర్‌లో జవసత్వాలు నింపారు.
ఈ క్రమంలోనే ఎన్నికలకు ముందు తన ఉంగుటూరు సీటు పొత్తు ధర్మంలో భాగంగా జనసేనకు త్యాగం చేయాల్సి వచ్చింది. చంద్రబాబు ఆదేశాల మేరకు సీటు వదులుకోవడంతో పాటు జనసేన నుంచి ఫస్ట్ టైం రాజకీయాల్లోకి వచ్చి ఎమ్మెల్యేగా పోటీ చేసిన పత్సమట్ల ధర్మరాజును ఏకంగా 44 వేల మెజార్టీతో గెలిపించడంలో గన్ని పాత్ర అమోఘం. పార్టీ అధికారంలోకి వచ్చాక చంద్రబాబు, లోకేష్ హామీ మేరకు నామినేటెడ్ పదవి రేసులో ముందున్న గన్ని అదే జోష్‌తో పార్టీని రేసుగుర్రంలా పరిగెత్తిస్తున్నారు.
తాజాగా ఉంగుటూరుకు టీడీపీ ఎమ్మెల్యే లేకపోయినా గన్ని ఒంటి చేత్తో ఏకంగా 50 వేల సభ్యత్వాలతో రికార్డులు బ్రేక్ చేశారు. పార్టీ నాలుగు దశాబ్దాల చరిత్రలో పార్టీ అధికారంలో ఉండి… పార్టీ ఎమ్మెల్యే లేని నియోజకవర్గంలో ఈ స్థాయిలో సభ్యత్వం అంటే మామూలు విషయం కాదు.. ఇది ఓ సెన్షేషనల్ రికార్డుగా నిలిచింది. ఈ సందర్భంగా గన్ని ఈ అరుదైన రికార్డును నియోజకవర్గ పార్టీ నాయకులు.. కేడర్ గొప్పతనమే అని పేర్కొన్నారు. త్వరలోనే 55 వేల మార్క్‌ను క్రాస్ చేస్తామని కూడా చెప్పారు.