ఏపీలో వక్ఫ్ బోర్డును ప్రభుత్వం రద్దు చేసిందన్న వార్తల్లో, ప్రచారంలో నిజం లేదని ప్రభుత్వం తాజాగా ఒక ప్రకటన విడుదల చేసింది. జగన్ హయాంలో వక్ఫ్ బోర్డును నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేశారని, దాని కోసం జీవో నం.47ను తెచ్చారని, దానిని మాత్రమే ప్రభుత్వం వెనక్కు తీసుకుందని క్లారిటీనిచ్చింది. నిబంధనల ప్రకారం సభ్యులను నియమించలేదని, మాజీ ఎంపీలకు అవకాశం కల్పించకపోవడం, పారదర్శకత లేకుండా జూ.లాయర్లను బోర్డు సభ్యులుగా నియమించడం వంటివి చేయడంతోనే ఆ జీవోను వెనక్కు తీసుకున్నామని చెప్పింది.
మార్చి 2023 నుంచి వక్ఫ్ బోర్డు సభ్యులు సరిగా పని చేయకపోవడంతో పాలన గాడి తప్పిందని, జీవో నెం.47 ఉపసంహరించుకోవాల్సి వచ్చిందని ప్రభుత్వం చెప్పింది. వక్ఫ్ బోర్డులో అంతర్గత వివాదాలు, సమస్యల వల్ల చైర్మన్ నియామకం జరగలేదని తెలిపింది. వర్క్ బోర్డు ఆస్తుల పరిరక్షణ, సుపరిపాలన కోసం ఆ జీవోను వెనక్కు తీసుకున్నామని, లోపాలను సరిదిద్ది కొత్త సభ్యులతో, ఛైర్మన్ తో వక్ఫ్ బోర్డును ఏర్పాటు చేస్తామని తెలిపింది.