శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో పొలిటికల్ హీట్ తారా స్థాయికి చేరింది. వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ సన్నిహితురాలు దివ్వెల మాధురి పోలీస్ స్టేషన్ మెట్లెక్కారు. ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పవన్ కల్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కొద్ది రోజుల క్రితం దువ్వాడ, దివ్వెల మాధురిపై జనసేన ఇన్ ఛార్జ్ కణితి కిరణ్ కేసు పెట్టిన సంగతి తెలిసిందే.
అయితే తాజాగా దివ్వెల మాధురి పోలీసులను ఆశ్రయించారు. సోషల్ మీడియా వేదికగా తనపై, దువ్వాడపై జనసేన నేతలు అభ్యంతర పోస్టులు పెట్టారని, తిరుపతి వెళ్లినప్పుడు పవన్ అభిమానులు తమను దారుణంగా అవమానించారని.. పవన్ కళ్యాణ్ సైతం దువ్వాడ శ్రీనివాస్ పై అసభ్యకరమైన కామెంట్స్ చేశారని ఆదివారం టెక్కలి సీఐ శ్రీనివాస్‌కు మాధురి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని మాధురి కోరారు.
అనంతరం మీడియాలో దివ్వెల మాధురి మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అసెంబ్లీ వేదికగా ఆడవాళ్లపై అనుచిత పోస్టులు పెట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. అందుకే తమపై అసభ్యకరమైన పోస్టులు పెడుతున్న వారిపై ఫిర్యాదు చేశానని మాధురి అన్నారు. ఈ విషయంపై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, హోంమంత్రి అనిత ఈ మేరకు చర్యలు తీసుకుంటారో చూస్తానని మాధురి అన్నారు. కాగా, మరోవైపు పవన్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో దువ్వాడ శ్రీనివాస్ అరెస్టుకు పోలీసులు రంగం సిద్ధం చేస్తున్నారు.