ఏపీ కి 2027లో మళ్లీ ఎన్నికలు రాబోతున్నాయంటూ తాజాగా వైసీపీ నేతలు కొత్త ప్రచారాన్ని అందుకున్నారు. ఇటువంటి వ్యాఖ్యలు చేసింది గల్లీ లీడర్లు అనుకునే పొరపాటే. వైసీపీలో జగన్ తర్వాత జగన్ అంతటి వారైన విజయసాయి రెడ్డి, సజ్జల రామకృష్ణా రెడ్డి కూటమి ప్రభుత్వం కూలుతుందని ఘంటా పథంగా చెబుతున్నారు. చిత్తూరు సభలో విజయసాయి రెడ్డి మాట్లాడుతూ.. 2027 చివరిలో ఎన్నికలు రాబోతున్నాయని, ఎన్నికల కోసం ఇప్పటి నుంచే సమాయత్తం కావాలని పిలుపునిచ్చారు.
మరోవైపు సజ్జల సైతం కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని.. పటిష్టమైన కార్యకర్తలను పార్టీ సిద్ధం చేస్తోందని అన్నారు. వచ్చే ఎన్నికల్లో విజయం వైసీపీదే అని సజ్జల అన్నారు. అసలు 2027లో ఎన్నికలు ఎందుకు వస్తాయి? ఎలా వస్తాయి? అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న. అయితే వైసీపీ అందుకున్న ఈ కొత్త ప్రచారం వెనుక జగన్ బిగ్ స్కెచ్ ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
2024 ఎన్నికల్లో ఎవరూ ఊహించని మెజారిటీతో కూటమి పార్టీలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. అధికారంలోకి వచ్చింది మొదలు సంక్షేమంతో పాటు అభివృద్ధికి పెద్ద పీట వేస్తూ పాలన సాగిస్తున్నారు. ముఖ్యంగా రాజధాని అమరావతి నిర్మాణం మరియు రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసేందుకు సీఎం చంద్రబాబు వేగంగా అడుగులు వేస్తున్నారు. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం సైతం అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించేందుకు ముందుకు వచ్చింది.
అలాగే ఆర్థికంగా చితికిపోయిన ఏపీని అభివృద్ధిలో పరుగులు పెట్టించేందుకు కూటమి ప్రభుత్వం పెట్టుబడుల వేట కూడా సాగిస్తోంది. ఓవైపు చంద్రబాబు, మరోవైపు మంత్రి లోకేష్ ఇద్దరూ పెట్టుబడుదారులను ఆకర్షించేందుకు గట్టిగా కష్టపడుతున్నారు. ఇటీవలె లోకేష్ అమెరికా వెళ్లి.. అక్కడి టాప్ కంపెనీ సీఈవోలతో మంతనాలు జరిపారు. ఇలాంటి సమయంలో వైసీపీ నేతలు 2027లో ఏపీకి ఎన్నికలు రాబోతున్నాయంటూ ప్రచారాన్ని మొదలు పెట్టారు.
మూడు పార్టీలు కాదు.. 30 పార్టీలు కలిసి వచ్చినా తగ్గేదే లేదు.. ఈ సారి విజయం మనదే అంటూ వైసీపీ ముఖ్య నేతల తెగ హడావుడి చేస్తున్నారు. ఈ తరహా ప్రచారాలు మరింత ఊపందుకుంటే పెట్టుబడుదారులు వెనకడుగు వేస్తారు. ఏపీ వైపు కన్నెత్తి కూడా చూడరు. అదే జరిగితే ఏపీలో అభివృద్ధి అటకెక్కుతుంది. అభివృద్ధి లేకపోతే కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో ప్రతికూలత ఏర్పడుతుంది. దాన్ని క్యాష్ చేసుకునేందుకే జగన్ 2027లో ఏపీకి ఎన్నికలు రానున్నాయని ప్రచారం చేయిస్తున్నారంటూ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.