అమెరికాలోని నెబ్రాస్కా గవర్నర్ ఇంట్లో తొలిసారిగా దీపావళి వేడుకలు ఘనంగా జరిగాయి. గవర్నర్ దంపతులు జిమ్ పిల్లెన్, సుజాన్నె పిల్లెన్ ల సమక్షంలో ఈ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకకు నెబ్రాస్కాలోని భారతీయ ప్రముఖులు డాక్టర్ ఫణి తేజ్ ఆదిదం, సుందర్ చొక్కర (నెబ్రాస్కా హిందూ దేవాలయం అధ్యక్షుడు), కొల్లి ప్రసాద్, నవీన్ కంటెం, మల్లికా మద్దూరి జయంతి, దిలీప్ దోనేపూడి, తాతారావు కోసూరి, రాజా కోమటిరెడ్డి, అరుణ్ పాండిచ్చేరి, వందనా సింగ్, ముకుంద్ క్యామ్టీ, సుధా శివమణి, ప్రశాంత్ పనిక్కస్సేరిల్, కీర్తి రంజిత్, తపన్ దాస్, శైలేష్ ఖోస్, ఇషాని అడిదమ్ మరియు శరత్ చంద్ర దొంతరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
తెలుగు, తమిళం, బెంగాలీ, మరాఠీ, కన్నడ, మలయాళం మరియు హిందీ కమ్యూనిటీలున్న విభిన్న ప్రాంతీయ, భాషా సంస్థలకు వీరు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. నెబ్రాస్కా ప్రథమ మహిళ సుజానే పిల్లెన్, గవర్నర్ రెసిడెన్స్ డైరెక్టర్ డయాన్ రెగ్నెర్ ఈ వేడుకను ప్రారంభించారు. ఈ సందర్భంగా అక్కడ ప్రదర్శించిన పలు కళాఖండాల చారిత్రక మరియు సాంస్కృతిక ప్రాముఖ్యత గురించి తమ అభిప్రాయాలు, ఆలోచనలను, దృష్టికోణాన్ని వారు పంచుకున్నారు. గవర్నర్ నివాసంలో ఉన్న గొప్ప వారసత్వం గురించి వేడుకకు హాజరైన వారికి వివరించారు.
బేస్మెంట్ హాల్లో ప్రథమ మహిళతో కలిసి దీపావళి వేడుకలను గవర్నర్ లాంఛనంగా ప్రారంభించారు. వారందరూ కలిసి దీపం వెలిగించి దీపావళి ఉత్సవాలకు నాంది పలికారు. ఆ తర్వాత డాక్టర్ ఫణి తేజ్ ఆదిదం హిందూ ప్రార్థన చేసి దాని ప్రాముఖ్యతను వివరించారు. దానిని గవర్నర్ హృదయపూర్వక ప్రశంసలతో స్వీకరించారు.
యూనివర్శిటీ ఆఫ్ నెబ్రాస్కా ఒమాహా విద్యార్థి నాయకురాలు ఇషాని అదిదం…సంఘం తరపున దీపావళి ప్రాముఖ్యతను తెలియజేస్తూ ప్రసంగించారు. మల్లికా మద్దూరి జయంతి కార్యక్రమాన్ని నిర్వహించి పండుగను పురస్కరించుకుని గవర్నర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
అమెరికన్ మరియు హిందూ సంప్రదాయాలలో ప్రతిధ్వనించే సారూప్యత, వైవిధ్యం, భాగస్వామ్య విలువల గురించి గవర్నర్ ప్రత్యేకంగా ప్రసంగించారు. దీపావళి వేడుకకు హాజరై తమ ఆతిధ్యాన్ని, విందు భోజనాన్ని ఆస్వాదించిన వారికి గవర్నర్ దంపతులు స్వయంగా వీడ్కోలు పలికారు. గవర్నర్ మాన్షన్‌లో ప్రతిభావంతులైన చెఫ్‌లు తయారుచేసిన రుచికరమైన విందుతో దీపావళి వేడుక ముగిసింది.