వైఎస్ కుటుంబంలో చోటుచేసుకున్న ఆస్తుల వివాదం యావత్ రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఆయన సోదరి వైఎస్ షర్మిల మధ్య ఆస్తుల పంపకాల్లో విభేదాలు తలెత్తినట్లు గతంలో పలుమార్లు వార్తలు వచ్చాయి. తాజా పరిణామాలు ఆ వార్తలనే నిజం చేశాయి. ఆస్తుల విషయంలో జగన్, షర్మిల మధ్య వార్ పీక్ స్టేజ్ కి చేరుకుంది. విషయం కోర్టుకెక్కడంతో.. షర్మిలమ్మపై వైసీపీ నేతలు విరుచుకుపడుతున్నారు.
తాజాగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. షర్మిలపై నిప్పులు చెరిగారు. జగన్ రాజకీయ ప్రత్యర్థుల కుట్రలో షర్మిల పావుగా మారిందని.. ఒక్కసారి ఆమె ఆత్మవిమర్శ చేసుకోవాలని విజయసాయిరెడ్డి అన్నారు. జగన్ పై అనేక కేసులు మోపిన కాంగ్రెస్ పార్టీతో, కుట్రలు చేసిన చంద్రబాబుతో షర్మిల చేతులు కలిపి సొంత అన్నపై విమర్శలు చేయడం దుర్మార్గమంటూ విజయసాయిరెడ్డి మండిపడ్డారు.
రాజశేఖర్ రెడ్డి మరణించిన పదేళ్ల తర్వాత స్వయంగా జగనే ఆస్తులను పంచి ఇస్తానని చెప్పారని.. తన స్వార్జితమైన ఆస్తుల్లో కూడా 40 శాతం ఇస్తానని ఏంవోయూ చేశారని విజయ సాయిరెడ్డి వివరించారు. ఆస్తులపై ఉన్న కోర్టు కేసులు పూర్తి అయిన తర్వాత పంపకాలు చేస్తానన్నారు. కానీ దొంగ సంతకాలతో జగన్ కు తెలీకుండా షేర్లు ట్రాన్స్ ఫర్ చేసుకోవాల్సిన అవసరమేంటని విజయ సాయిరెడ్డి ప్రశ్నించారు.
కేసుల ఉన్న నేపథ్యంలో ఆస్తుల ట్రాన్స్ ఫర్ జరిగితే జగన్ బెయిల్ రద్దు అవుతుందన్న విషయం షర్మిలకు తెలుసని.. మళ్లీ సీఎం కాకుండా జగన్ ను జైలుకు పంపడమే ఆమె ఉద్దేశమని విజయసాయిరెడ్డి అన్నారు. జగన్ ప్రత్యర్థులతో కలిసి షర్మిల తన సొంత అన్నపై కుట్ర చేస్తుందని ఫైర్ అయ్యారు. ప్రస్తుతం విజయసాయిరెడ్డి కామెంట్స్ వైరల్ గా మారాయి.