దసరా పండుగ సందర్భంగా రేషన్ కార్డు ఉన్న వారికి ఏపీ సర్కార్ అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. వంట నూనెలపై దిగుమతి సుంకం పెంచుతున్నట్లు మోడీ సర్కార్ ప్రకటించడంతో సామాన్యులపై పెనుభారం పడింది. ఇప్పటికే కూరగాయల ధరలతో అల్లాడిపోతున్న ప్రజలకు వంట నూనెల ధరలు మరింత షాకిస్తున్నాయి. ఇలాంటి తరుణంలో ఏపీలో కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
నేటి నుంచి రాష్ట్రంలోని అన్ని రేషన్ దుకాణాల్లో పామాయిల్ లీటరు రూ.110, సన్ఫ్లవర్ ఆయిల్ లీటరు రూ.124కే అందించాలని నిర్ణయించింది. ఒక్కో రేషన్ కార్డుపై ఒక లీటర్ సన్ఫ్లవర్ నూనె, అలాగే మూడు లీటర్ల పామాయిల్ నిర్ణయించిన ధరలపై విక్రయించనున్నారు. నేటి నుంచి ఈ నెలాఖరు వరకు ఈ ధరలు అందుబాటులో ఉంటాయి.
ఈ మేరకు పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటన చేశారు. గురువారం విజయవాడలోని పౌరసరఫరాలశాఖ కార్యాలయంలో వంటనూనెల సరఫరాదారులు, ఛాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యులు, వర్తక సంఘాల ప్రతినిధులతో నాదెండ్ల మనోహర్ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ధరల నియంత్రణపై చర్చించారు. రాష్ట్రమంతటా నూనెల ధర ఒకేవిధంగా ఉండాలని.. అందుకు తగు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు మంత్రి ఆదేశించారు.