ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చొరవతో ఏపీ కి కేంద్రం నుండి మరో వరం లభించనుంది. అదే బుల్లెట్ ట్రైన్. దేశంలోనే అత్యంత కీలకమైన ప్రాజెక్ట్ ఇది. ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచీ రైల్వేకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్న నరేంద్ర మోదీ.. ఎంతో ప్రతిష్టాత్మకంగా బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ చేపట్టారు. ప్రస్తుతం మహారాష్ట్రలోని మంబై, గుజరాత్‌లోని అహ్మదాబాద్ మధ్యన బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు నిర్మాణం జరుగుతోంది. అయితే ఏపీలోనూ బుల్లెట్ రైలు పరుగులు పెట్టబోతోంది.
సీఎం చంద్రబాబు గత రెండు రోజుల నుంచి ఢిల్లీ పర్యటనలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన బుల్లెట్ ట్రైన్ ప్రతిపాదనను ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా ముందు పెట్టగా.. వారి నుంచి సానుకూల సంకేతాలు వచ్చినట్టు తెలుస్తోంది. అలాగే అక్కడి రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో కూడా భేటీ అయిన చంద్రబాబు.. పలు కీలక విషయాలు చర్చించారు. మంగళవారం సాయంత్రం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. బుల్లెట్ ట్రైన్ విషయాన్ని బాబు రివీల్ చేశారు.
అమరావతి, హైదరాబాద్, చెన్నై, బెంగుళూరు సిటీలను కలుపుతూ బుల్లెట్ రైలు రానుందని పేర్కొన్నారు. ఈ నాలుగు నగరాలను అనుసంధానించేలా బుల్లెట్ ట్రైన్ ను నడిపితే ఆర్థికపరమైన కార్యకలాపాలు మరింత పెరుగుతాయనే విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లామని చంద్రబాబు తెలియజేశారు. తన ప్రతిపాదనలపై కేంద్రం సానుకూలంగా స్పందించందని.. అన్నీ అనుకున్నట్లు జరిగితే 2027 నుంచి ఏపీలో బుల్లెట్ ట్రైన్ పనులు స్టార్ట్ అవుతాయని చంద్రబాబు పేర్కొన్నారు. కాగా, దక్షిణాది రాష్ట్రాలను కలుపుతూ నిర్మించనున్నఈ హై-స్పీడ్ రైలు ప్రాజెక్టుకు చెన్నై, హైదరాబాద్, బెంగళూరు పట్టణాలతో పాటు అమరావతిని కూడా కేంద్రం అనుసంధానం చేస్తే ఏపీకి అది నిజంగా కలిసొచ్చే అంశమే అవుతుంది.