తిరుమల శ్రీవారి పవిత్ర లడ్డూ ప్రసాదానికి వినియోగించే నెయ్యి కల్తీ జరిగిందన్న సీఎం చంద్రబాబు ఆరోపణలు రాజకీయంగా దుమారం రేపిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో టీటీడీ బోర్డు మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సహా పలువు రు సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. వీటిని విచారిస్తున్న సుప్రీంకోర్టు అసలు కల్తీ విషయం నిగ్గు తేల్చేలా సీబీఐ, ఏపీ పోలీసు సహా.. ఎఫ్ ఎస్ ఎస్ ఏఐతో కూడిన ఒక ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేస్తూ శుక్రవారం ఉదయం ఆదేశాలు జారీ చేసింది.
ఈ వ్యవహారంపై ఏపీ సీఎం చంద్రబాబు స్పందించారు. సుప్రీంకోర్టు ఆదేశాలను స్వాగతిస్తున్నట్టు చెప్పా రు. సీబీఐ నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందం ఈ కేసును విచారణకు స్వీకరించడం.. ఆహ్వానించదగ్గ పరిణామమని అన్నారు. దీనికి ప్రభుత్వం తరఫున పూర్తిస్థాయిలో సహకారం అందిస్తామని కూడా చెప్పారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఆయన పోస్టు చేశారు. దీనికి `సత్యమేవ జయతే.. ఓం నమో వేంకటేశాయ` అని పేర్కొన్నారు.
ఇదిలావుంటే, సీబీఐ నేతృత్వంలో ఏర్పాటు చేసే ప్రత్యేక దర్యాప్తు బృందం ఎప్పటిలోగా విచారణను పూర్తి చేయాలి? నివేదికను ఎవరికి అందించాలి? ఏయే అంశాలను ప్రధానంగా పరిగణనలోకి తీసుకోవా లన్న విషయాలను సుప్రీంకోర్టు స్పష్టం చేయలేదు. వాస్తవానికి సీబీఐ కేసులు అంటే.. సుదీర్ఘంగా నెలలు సంవత్సరాల తరబడి సాగుతున్నాయి. ఉదాహరణకు మాజీ సీఎం జగన్ కేసులు 2012 నుంచి `సాగుతూ` నే ఉన్నాయి. మరి ఈ కేసుకు ఎలాంటి సమయం నిర్దిష్టంగా పేర్కొనకపోవడంతో సీబీఐ ఏమేరకు త్వరగా ఇస్తుందన్నది చూడాలి.
మరోవైపు సుప్రీంకోర్టు ఆదేశాలను వైసీపీ నాయకులు కూడా స్వాగతించారు. తాము కోరుకున్నది కూడా ఇదేనని నాయకులు వ్యాఖ్యానించారు. సీబీఐ నేతృత్వంలోని సిట్ నిష్పక్షపాతంగా దర్యాప్తు చేసి నిగ్గు తేల్చాలనే తాము కూడా ఆశిస్తున్నట్టు సోషల్ మీడియాలో పేర్కొంటున్నారు. ఇక, కాంగ్రెస్ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల కూడా సుప్రీంకోర్టు ఆదేశాలను స్వాగతించారు. తిరుమలను అపవిత్రం చేసిన వారు ఎవరైనా కోర్టు ముందు నిలబడాల్సిందేనని తెలిపారు.