శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమలలో అధికారులు ఏర్పాట్లు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే అనుకోకుండా అపశృతి జరిగింది. ధ్వజస్తంభంపై ఇనుప కొక్కి విరిగి పడిన ఘటన చర్చనీయాంశమైంది. ఈ రోజు సాయంత్రం నిర్వహించబోతున్న ధ్వజారోహణలో ధ్వజస్తంభంపై గరుడ పతాకాన్ని ఈ కొక్కి ద్వారా ఎగుర వేయడం ఆనవాయితీ. ఈ క్రమంలోనే ఈ కొక్కి ఏర్పాటు చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అయితే, ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. 9 రోజుల పాటు ధ్వజస్తంభంపై ఈ గరుడ పతాకాన్ని ఉంచుతారు. చివరి రోజున పతాకాన్ని అవనతం చేస్తారు.
మరోవైపు, తిరుపతి లడ్డూ కల్తీపై దాఖలైన పిటిషన్లను విచారణ జరిపిన సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. సీబీఐ డైరెక్టర్ పర్యవేక్షణలో స్వతంత్ర సిట్ తో విచారణ జరిపించాలని, ఈ వ్యవహారంపై రాజకీయపరమైన వ్యాఖ్యలు, పొలిటికల్ డ్రామాలు వద్దని జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కేవీ విశ్వనాథన్ లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఆదేశించింది.
సీబీఐ డైరెక్టర్ పర్యవేక్షణలో సీబీఐ నుంచి ఇద్దరు అధికారులు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇద్దరు అధికారులు, ఎఫ్ఎస్ఎస్ఏఐ నుంచి ఒక అధికారి ఉండాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. ఏపీ ప్రభుత్వం నియమించిన సిట్ విచారణపై సందేహాలు లేవని, సిట్‌పై కేంద్ర సంస్థ పర్యవేక్షణ ఉంటే బాగుంటుందని సుప్రీంకోర్టు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. స్వతంత్ర దర్యాప్తు జరిగితే బాగుంటుందని జస్టిస్ బీఆర్ గవాయ్ అన్నారు. బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి, వైఎస్ఆర్సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డిలతో పాటు పలువురు దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ జరిపిన సుప్రీం కోర్టు ఈ ఆదేశాలిచ్చింది.
ఈ క్రమంలోనే సుప్రీం కోర్టు తీర్పును ఏపీ సీఎం చంద్రబాబు స్వాగతిస్తూ ఎక్స్ లో ట్వీట్ చేశారు. “తిరుపతి లడ్డూ కల్తీ వ్యవహారంపై దర్యాప్తునకు సీబీఐ, ఏపీ పోలీసులు, ఎఫ్ఎస్ఎస్ఏఐ అధికారులతో కూడిన సిట్‌ను ఏర్పాటు చేస్తూ సుప్రీంకోర్టు జారీ చేసిన ఆదేశాలను స్వాగతిస్తున్నాను. సత్యమేవ జయతే. ఓం నమో వేంకటేశాయ” అని చంద్రబాబు ట్వీట్ చేశారు.