రైతుల కష్టాలు, విద్య, వైద్యం, ఉపాధి, రాజధాని, దళితులపై దాడులు, నాసిరకం మద్యం, పెరిగిన పెట్రోల్ ధరలు, చేసిన అప్పులు, అధిక పన్నులు.. ఇలా ఒకటా రెండా ఏపీలో జగన్ రెడ్డి అరాచక పాలనకు హద్దే లేకుండా పోయింది. గత ఐదేళ్లు అరాచకాలు, అక్రమాలు, అన్యాయాలను పంటి బిగువున భరించిన జనం.. ఇటీవల జరిగిన సార్విత్రిక ఎన్నికల్లో ఓటు అనే ఆయుధంతో వైసీపీ ప్రభుత్వానికి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చారు. 151 సీట్లలో మధ్యలో ఉన్న 5 తీసేసి 11 సీట్లతో గట్టిగా బుద్ధి చెప్పారు. అయినా సరే జగన్ లో మార్పు రాలేదు.
మళ్లీ వచ్చేది వైసీపీ ప్రభుత్వమే అంటూ పగటి కలలు కంటున్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన జడ్పీటీసీ, ఇతర నాయకులతో నేడు వైస్ జగన్ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా వైసీపీ కార్యకర్తల్లో భరోసా నింపడం కోసం జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గత ఐదేళ్లలో ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చామని..ప్రతి ఏడాది సంక్షేమ క్యాలెండర్ విడుదల చేశామని.. కానీ కూటమి ప్రభుత్వంలో ఇప్పుడా పరిస్థితి కనిపించడం లేదని జగన్ విమర్శించారు.
వైసీపీ పాలనకు, టీడీపీ పాలనకు మధ్య తేడాను ప్రజలు గమనిస్తున్నారని.. నాలుగు నెలల్లోనే రాష్ట్రంలో పరిస్థితులు దిగజారాయని జగన్ పేర్కొన్నారు. చంద్రబాబు మోసాలపై ప్రజల్లో ఆగ్రహం పెరుగుతుందని జగన్ చెప్పుకొచ్చారు. వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఓపికతో ముందుకు సాగాలని.. ఎల్లప్పుడూ ప్రజలకు అండగా నిలబడాలని సూచించారు. రెడ్ బుక్ కు, కేసులకు భయపడక్కర్లేదన్నారు. రాజకీయాల్లో వ్యక్తిత్వం, విశ్వసనీయత చాలా ముఖ్యమన్నారు. మళ్లీ వచ్చేది వైసీపీ ప్రభుత్వమే అని జగన్ ధీమా వ్యక్తం చేశారు.
అయితే జగన్ వ్యాఖ్యల పట్ల టీడీపీ కూటమి నేతలు సెటైర్లు పేలుస్తున్నారు. నిజానికి జగన్ అధికారం నుంచి దిగాకే రాష్ట్రంలో పాలన సక్రమంగా సాగుతుందని.. కుంటుపడిన అభివృద్ధిని చంద్రబాబు పరుగులు పెట్టిస్తున్నారని కూటమి నేతలు అభిప్రాయపడుతున్నారు. జగన్ పగటి కలలు కనడం మానేస్తే మంచిదని హితవు పలుకుతున్నారు.