తిరుమల శ్రీవారి పవిత్ర లడ్డూ ప్రసాదం కల్తీ అయిందని.. ఏకంగా జంతువుల కొవ్వును నెయ్యికి వినియో గించారని ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. గత వారం రోజుల పాటు ఈ విషయం తీవ్రస్థాయిలో దుమారం రేపింది. రాజకీయ పక్షాలు కత్తులు నూరుకున్నాయి. ఈ నేపథ్యంలో వాస్తవాలు నిగ్గు తేల్చేలా.. కూటమి సర్కారు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(సిట్) నియమించింది. సీనియర్ ఐపీఎస్ అధికారి సర్వశ్రేష్ఠ త్రిపాఠి నేతృత్వంలో ఈ సిట్ పనిచేస్తోంది.
తాజాగా సిట్ బృందం తిరుమలకు చేరుకుంది. సోమవారం నుంచి వారం రోజుల పాటు తిరుమలలోనే ఉండి.. లడ్డూ ప్రసాదంపై వచ్చిన ఆరోపణల్లో నిగ్గు తేల్చనుంది. అదేవిధంగా నెయ్యి స్టోరేజీ పాయింట్లు, గతంలో ఉన్న నిల్వలు, ల్యాబుల పనితీరును తెలుసుకోవడంతోపాటు.. సిబ్బందిని కూడా సిట్ అధికారు లు ప్రశ్నించనున్నారు. అదేవిధంగా లడ్డూ తయారు చేసే పోటు ప్రాంతాన్ని కూడా సిట్ అధికారులు పరిశీలించనున్నారు. ఈ క్రమంలో గతంలో పనిచేసి రిటైరైన పోటు అధికారులను కూడా విచారించనున్నారు.
ఇక, కల్తీ నెయ్యిని సరఫరా చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న చెన్నైకి చెందిన(దుండిగల్ ప్రాంతం) ఏఆర్ ఇండస్ట్రీస్ యాజమాన్యాన్ని కూడా సిట్ అధికారులు విచారిస్తారు. అదేవిధంగా లడ్డూ నమూనాల ను కూడా పరిశీలించి.. ల్యాబ్ రిపోర్టులను తెప్పించుకోనున్నారు. నెయ్యి ట్యాంకర్ల డ్రైవర్లను కూడా అధికారులు అదుపులోకి తీసుకుని విచారించనున్నారు. ఇలా.. కల్తీ నెయ్యి వాడకంపై సిట్ బృందం అన్ని కోణాల్లోనూ ఆరా తీయనుంది. అనంతరం తమ నివేదికను ప్రభుత్వానికి అందించనుంది. దీని ప్రకారం సర్కారు చర్యలు తీసుకునే అవకాశం ఉంది.