వైసీపీ రాజ్యసభ సభ్యుడు, టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి కి మంత్రి నారా లోకేష్ ఛాలెంజ్ విసిరారు. హిందువులు ఎంతో పవిత్రంగా భావించే తిరుమల తిరుపతి శ్రీవేంకటేశ్వరసామి లడ్డూ ప్రసాదంలో గత ప్రభుత్వం జంతువుల కొవ్వు కలిపిందంటూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించడంతో రచ్చ మొదలైంది. శ్రీవారి లడ్డూలో ఫిష్ ఆయిల్, బీఫ్ ఫ్యాట్, పోర్క్ ఫ్యాట్ ఉందని విజిలెన్స్ ప్రాథమికంగా రిపోర్ట్ కూడా ఇవ్వడంతో.. రాష్ట్రంలో ఈ ఇష్యూ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
ఇటువంటి మహా పాపానికి పాల్పడిన వైకాపా ప్రభుత్వం మరియు గత టీటీడీ యాజమాన్యంపై రాజకీయ నేతలు, హిందువులు, స్వామి వారి భక్తులందరూ దుమ్మెత్తిపోస్తున్నారు. ఆలయం పవిత్రతను, హిందువుల నమ్మకాలను, విశ్వాసాలను ఘోరంగా దెబ్బతీశారని మండిపడుతున్నారు. అయితే ఈ విషయంపై వైవీ సుబ్బారెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు వ్యాఖ్యలను ఆయన ఖండించారు. రాజకీయ లబ్ధికోసం చంద్రబాబు ఇటువంటి ఆరోపణలు చేస్తున్నారని.. శ్రీవారి లడ్డూ ప్రసాదంలో ఎటువంటి కల్తీ జరగలేదని కుటుంబంతో సహా భగవంతుడి సన్నిధిలో ప్రమాణం చేయడానికి తానుసిద్ధమని, అలా చేయడానికి చంద్రబాబు సిద్ధమా? అంటూ వైవీ సవాల్ విసిరారు.
వైవీ సవాలుకు తాజాగా మంత్రి లోకేష్ ప్రతి సవాలు విసిరారు. తిరుమల లడ్డూ అపవిత్రం అయిందని తాము ఆధారాలు చూపించామని.. ల్యాబ్ రిపోర్ట్ లు బయటపెట్టామని.. ఇంకా ఏం నిరూపించాలని లోకేష్ ప్రశ్నించారు. ఇప్పుడు తాను తిరుపతిలోనే ఉన్నాను.. ప్రమాణం చేయడానికి రెడీగా ఉన్నా.. సుబ్బారెడ్డి రెడీగా ఉంటే రమ్మనండి అంటూ లోకేష్ ఛాలెంజ్ చేశారు. దేవుడి దగ్గర కూడా వారు రాజకీయాలు చేశారని.. తప్పు చేసిన ప్రతి ఒక్కరిపై చర్యలు ఉంటాయని లోకేష్ వార్నింగ్ ఇచ్చారు. ప్రజాప్రభుత్వం టీటీడీని ప్రక్షాళన చేస్తుందని తెలిపారు. ఇక లోకేష్ ప్రతి సవాల్ చేయడంతో.. ప్రమాణం చేయడానికి వైవీ ముందడుగు వేస్తారా? లేక మాటలతోనే సరిపెడతారా? అన్నది చూడాలి.