ఏపీలో టీడీపీ కూటమి అధికారికంలోకి వచ్చాక విపక్షంలో ఉన్న వైసీపీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. వైసీపీ చేతుల్లో ఉన్న స్థానిక సంస్థలు ఒక్కొక్కటిగా టీడీపీ గుప్పిట్లోకి వెళ్లిపోతున్నాయి. ఈ జాబితాలో ఏలూరు కార్పొరేషన్ చేరబోతోంది. ఏలూరు కార్పొరేషన్ మేయర్ షేక్ నూర్జహాన్ నేడు టీడీపీ తీర్థం పుచ్చుకుంటున్నారు. ఉండవల్లిలోని పార్టీ కార్యాలయంలో సీఎం చంద్రబాబు, లోకేశ్ సమక్షంలో మేయర్ దంపతులు టీడీపీలో చేరుతున్నారు.
ఇందులో భాగంగానే సోమవారం వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు నూర్జహాన్ వైకాపా అధినేత జగన్కు లేఖ పంపారు. మేయర్ దంపతులతో పాటు మరో 30 మందికిపైగా వైసీపీ కార్పొరేటర్లు నేడు సైకిల్ ఎక్కబోతున్నారు. దీంతో ఏలూరులో వైసీపీ ఖాళీ అయినట్లే అని అంటున్నారు.
ఇప్పటికే పార్టీ పెద్ద దిక్కు, మాజీమంత్రి ఆళ్ల నాని వైసీపీకి గుడ్ బై చెప్పేశారు. పార్టీ సభ్యత్వానికి, జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. అలాగే బొద్దాని శ్రీనివాస్ వంటి నేతలు కూడా పార్టీని వీడారు. వీరిలో ఆళ్ల నాని జనసేన గూటికి చేరేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టగా.. మిగిలిన వారంతా మేయర్, కార్పోరేటర్లతో కలిసి టీడీపీ ఖండువా కప్పుకోబోతున్నారు.
కాగా, మేయర్ షేక్ నూర్జహాన్ దంపతుల రాజకీయ ప్రస్థానం టీడీపీలోనే మొదలైంది. 2014 మున్సిపల్ ఎన్నికల్లో అప్పటి ఎమ్మెల్యే బడేటి బుజ్జి ప్రోత్సహాంతో నూర్జహాన్ దంపతులు పాలిటిక్స్ లోకి వచ్చారు. ఐదేళ్లు టీడీపీలో కొనసాగాక బుజ్జితో విభేదాలు తలెత్తడంతో.. 2019లో వైసీపీ లోకి జంప్ అయ్యారు. నగర పాలక సంస్థ ఎన్నికల సమయంలో నూర్జహాన్ కు వైసీపీ మేయర్ పదివి కట్టబెట్టింది. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఓటమి పాలవ్వడంతో ప్రతిపక్షంలో ఉండలేక మేయర్ దంపతులు మళ్లీ సొంత గూటికే చేరారు.