ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్ర రాజధాని అమరావతే అని.. మూడు రాజధానుల ప్రతిపాదన ఇక ముగిసిన ముచ్చట అని ప్రకటించిన సంగతి తెలిసిందే. అటు పోలవరం, ఇటు అమరావతి.. ఈ రెండింటినీ పూర్తి చేయడమే లక్ష్మంగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇప్పటికే అమరావతికి రూ.15 వేల కోట్ల సాయం చేసేందుకు ప్రపంచ బ్యాంకు ముందుకు వచ్చింది.
ఇదే తరుణంలో అమరావతి నిర్మాణ పనులు ప్రారంభానికి రాష్ట్ర ప్రభుత్వం ముహూర్తం కూడా ఫిక్స్ చేసింది. డిసెంబర్ 1 నుంచి అమరావతి నిర్మాణ పనులు స్టార్ట్ కాబోతున్నాయి. రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ తాజాగా ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించారు. నేడు కృష్ణా జిల్లా కంకిపాడు లో క్రెడాయ్ సౌత్ కాన్-2024 సదస్సు ప్రారంభం కాగా.. నారాయణ స్పెషల్ గెస్ట్ గా హాజరు అయ్యారు.
ఈ సందర్భంగా మీడియాతో ముచ్చటించిన.. డిసెంబర్ 1 నుంచి అమరావతి నిర్మాణ పనులు షురూ చేయబోతున్నట్లు పేర్కొన్నారు. రాజధాని నిర్మాణం కోసం రూ.60 వేల కోట్ల బడ్జెట్ అవుతుందని భావిస్తున్నామని.. రాబోయే నాలుగేళ్లలో అమరావతి నిర్మాణం పూర్తవుతుందని నారాయణ తెలిపారు. ప్రపంచంలోనే ఉత్తమ నగరంగా అమరావతిని తీర్చిదిద్దుతామని.. ఈ నగరం అత్యద్భుతంగా ఉండబోతోందని చెప్పుకొచ్చారు. నిర్మాణ రంగ అభివృద్ధికి అధికారులతో సమీక్షిస్తున్నామని నారాయణ వివరించారు.