ఏపీలో గత వైసీపీ పాలనలో టాలీవుడ్ గడ్డు పరిస్థితులను ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ పై ఉన్న అక్కసుతో జగన్ అండ్ కో మొత్తం తెలుగు చిత్ర పరిశ్రమను ఇబ్బందులకు గురి చేసింది. అయితే ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం, పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గా బాధ్యతలు చేపట్టడంతో టాలీవుడ్ పండగ చేసుకుంది. మళ్లీ సినీ పరిశ్రమకు మంచి రోజులు మొదలవుతాయని సంబరపడిపోయింది.
సినీ రంగ సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని టాలీవుడ్ పెద్దలకు, నిర్మాతలకు ఇటీవల పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. అయితే ప్రస్తుతం ఏపీకి టాలీవుడ్ ను విస్తరించాలని డిప్యూటీ సీఎం మాస్టర్ ప్లాన్ వేస్తున్నారు. రాష్ట్రంలో స్టూడియోల నిర్మాణం కోసం ముందుకు రావాలని ఏపీ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఆల్రేడీ ఆహ్వానం పలికారు. దుర్గేష్ ఆహ్వానంపై తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, తెలుగు నిర్మాతల మండలి సానుకూలంగా స్పందించింది. రాష్ట్రంలో తెలుగు చలనచిత్ర అభివృద్ధికి త్వరలో టాలీవుడ్ నుంచి ఒక బృందాన్ని అమరావతిని సందర్శించబోతోంది.
మరోవైపు పవన్ కళ్యాణ్ కూడా యాక్షన్ ప్లాన్ లోకి దిగారు. విజయవాడ, విశాఖ, తిరుపతి వంటి నగరాలతో పాటు గోదావరి జిల్లాల్లో సినిమా షూటింగ్స్ జరుపుకోవడానికి అనువుగా కొన్ని సుందరమైన ప్రాంతాలను గుర్తుస్తున్నారు. అలాగే స్టూడియోల నిర్మాణానికి అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. రాజధాని అమరావతితో పాటు మిగతా ప్రాంతాల్లో సైతం స్టూడియోల నిర్మాణానికి ప్రణాళికలు రచిస్తున్నారు. ఏపీకి టాలీవుడ్ ను విస్తరించడం పై త్వరలోనే పవన్ కళ్యాణ్ సీఎం చంద్రబాబుతో కూడా భేటీ కానున్నారని తెలుస్తోంది.