నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గం వైసీపీకి కంచుకోట. పేరుకు ఎస్సీ నియోజకవర్గం అయినప్పటికీ మొదటి నుంచి అక్కడ రెడ్ల హవానే నడించింది. వైసీపీ ఆవిర్భవించకముందు కాంగ్రెస్, ఆ తర్వాత వైసీపీ అక్కడ బలమైన పట్టు సాధించింది. కానీ ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల తర్వాత సీన్ రివర్స్ అయింది. ఎన్నో ఏళ్ల తర్వాత అక్కడ టీడీపీ జెండా ఎగిరింది.
వైసీపీ అభ్యర్థి దారా సుధీర్ పై టీడీపీ అభ్యర్థి గిత్తా జయసూర్య నందికొట్కూరు నియోజకవర్గం నుంచి శాసన సభకు ఎన్నికయ్యారు. పైగా రాష్ట్రంలో కూడా టీడీపీ కూటమి గెలిచింది. వైసీపీ ఘోరమైన పరాజయాన్ని మూటగట్టుకుంది. దాంతో గత పదేళ్ల నుంచి వైసీపీ కంచుకోట ఉన్న నందికొట్టూరు ఆల్మోస్ట్ ఖాళీ అయిపోయింది. వైసీపీలోని నాయకులంతా మూకుమ్మడిగా టీడీపీలోకి జంప్ అవుతున్నారు. ఆల్రెడీ మున్సిపాలిటీలో వైసీపీ ఖాళీ కాగా.. ప్రస్తుతం మండల స్థాయి నాయకులు సైతం పార్టీకి గుడ్ బై చెబుతున్నారు.
బైరెడ్డి రాజశేఖరరెడ్డి, మాండ్ర శివానందరెడ్డి సమక్షంలో వారంతా టీడీపీ కండువాలు కప్పుకుంటున్నారు. నందికొట్కూరు వైసీపీ ఇంఛార్జ్‌గా పని చేసిన బైరెడ్డి సిద్ధార్థరెడ్డి కూడా నియోజకవర్గం వైపు కన్నెత్తి చూడకపోవడంతో.. అక్కడ పార్టీ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. గత స్థానిక సంస్థల ఎన్నికల్లో 29 స్థానాలకు గాను వైసీపీ ఏకంగా 28 స్థానాలు సాధించి నందికొట్కూరు మున్సిపాలిటీని గెలుచుకుంటే.. టీడీపీ ఒక స్థానానికి పరిమితం అయింది.
అలాగే వైకాపా హయాంలో మండలాల్లో సైతం ఆ పార్టీ డామినేషన్నే కనిపించింది. కానీ సార్వత్రిక ఎన్నికల తర్వాత వైసీపీలో ఉండే ఫ్యూచర్ ఉండదని భావించిన ఆ పార్టీ కౌన్సిలర్లు, మండల నాయకులు మంచి టైమ్ చూసుకుని సైకిల్ ఎక్కేస్తున్నారు. దీంటో టీడీపీ బలం భారీగా పెరిగింది. ఇక ఇటువంటి పరిణామాల నడుమ పార్టీ కేడర్‌ను ఎలా కాపాడుకోవాలో తెలియక జిల్లా స్థాయి వైసీపీ నాయకులు తలలు పట్టుకుంటున్నారు.