మామను మించిన అల్లుడుగా చంద్రబాబు రికార్డు సృష్టించారు. ఇది ఆశ్చర్యం అని అనుకున్న ఆశ్చర్యం అయితే కాదు. వాస్తవం. గతంలో అన్నగారు ఎన్టీ రామారావు అధికారంలోకి వచ్చినప్పుడు పేదల పక్షాన ఆయన అనేక కార్యక్రమాలు చేపట్టారు. వాటిలో ప్రధానంగా రెండు రూపాయలకు కిలో బియ్యం, జనతా వస్త్రాల పంపిణీ వంటివి మంచి పేరు తెచ్చుకున్నాయి. అదే సమయంలో పేదలకు ఇళ్లను ఇచ్చే అంశం మీద రామారావు కసరత్తు చేశారు. దీంతో సంక్షేమానికి మారుపేరుగా ఎన్టీ రామారావు పేరు నిలబడిపోయింది.
ఆయన చనిపోయి దశాబ్దాలు గడుస్తున్నా ఎన్టీ రామారావు పేరు ఇంతగా వినిపించడానికి కారణం ఆనాడు ఆయన ప్రవేశపెట్టిన రెండు రూపాయల కిలో బియ్యం జనతా వస్త్రాలు ప్రధాన కారణం. ఇప్పుడు మామ గారిని మించిన అల్లుడు గా చంద్రబాబు సంక్షేమానికి పెద్ద పీట వేయాలని నిర్ణయించుకున్నారు. దీనిలో భాగంగానే ఆనాడు ఎన్టీ రామారావు రెండు రూపాయల కిలో బియ్యం ఇస్తే ఈరోజు చంద్రబాబు ₹5కే పేదలకు కడుపు నింపే అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేశారు. ఇది సంచలమైనటువంటి విషయమనే చెప్పాలి.
దీని వెనుక ఓటు బ్యాంకు రాజకీయం ఉందా లేదా అనేది పక్కన పెడితే ఇది పేదలకు ఒకరకంగా ముఖ్యంగా రోజువారి పని చేసుకునే వారికి చిరు వ్యాపారాలు చేసుకునే వారికి మరింత మేలు చేకూర్చనుంది. సహజంగానే రాజకీయ నాయకులు వేసే ప్రతి అడుగులోను రాజకీయ కోణం ఉంటుంది. కాబట్టి ఏ కార్యక్రమాన్ని తప్పుపట్టాల్సిన అవసరం లేదు. అయితే ఇప్పుడు ఎన్టీ రామారావును మించినట్టుగా ఆనాడు ఆయన బియ్యం ఇస్తే ఈనాడు ఏకంగా భోజనం పెడుతున్న పరిస్థితిని మనం గమనించాల్సి ఉంటుంది.
కాబట్టి ఇప్పుడు ఎక్కడ విన్నా మామను మించిన అల్లుడు అనే మాట చంద్రబాబు విషయంలో వినిపిస్తుండడం గమనార్హం. మరోవైపు పేదలకు పూర్తిస్థాయిలో పక్కా ఇల్లు నిర్మించే అంశంపై కూడా చంద్రబాబుకు శ్రద్ధ చూపిస్తున్నారు. గతంలో నిర్మించి వదిలేసిన టిడ్కో ఇళ్లను త్వరలోనే ఆయన పేదలకు అందించనున్నారు. ఈ కారణంతో పేదల పక్షపాతిగా చంద్రబాబు రామారావును మించి పేరు తెచ్చుకుంటారని పార్టీ నాయకులు అభిప్రాయం వ్యక్తం చేస్తుండడం గమనార్హం.