ఏపీలో నారా లోకేశ్ ‘రెడ్ బుక్’ రాజ్యాంగం నడిపిస్తున్నారని వైసీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. రెడ్ బుక్ లో రాసుకున్న పేర్లను లోకేశ్ టార్గెట్ చేస్తున్నారని వారు ఆరోపణలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఆ రెడ్ బుక్ వ్యవహారంపై మరోసారి లోకేశ్ క్లారిటీనిచ్చారు. రెడ్ బుక్ లో తాను ఏం చెప్పానో ఓసారి పరిశీలించుకోవాలని హితవు పలికారు. చట్టాలు ఉల్లంఘించి కార్యకర్తలను, ప్రజలను ఇబ్బంది పెట్టిన వారిని మాత్రమే వదిలిపెట్టనని చెప్పిన విషయాన్ని లోకేశ్ గుర్తు చేశారు.
జోగి రమేశ్ వాళ్ల అబ్బాయి చేసిన అరాచకం ఏంటో ప్రజలు తెలుసుకోవాలని లోకేశ్ అన్నారు. అగ్రిగోల్డ్ భూముల నకిలీ పత్రాలు సృష్టించి తన పేరు మీదకు జోగి రమేశ్ తనయుడు బదిలీ చేసుకున్నాడని ఆరోపించారు. ఆ తర్వాత ఆ భూములను అమ్మేశాడని గుర్తు చేశారు. అగ్రిగోల్డ్ బాధితులు ఇప్పటికీ ఇబ్బందులు పడుతున్నారని, ఈ క్రమంలోనే ఆ భూములు అమ్ముకున్న రమేశ్ కుమారుడిపై ప్రభుత్వం చర్యలు తీసుకోకూడదా? అని ప్రశ్నించారు.
మద్యం వ్యవహారంలోనూ చర్యలు తీసుకుంటామని, ఇసుక దందా చేసిన వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. రెడ్ బుక్ లో తప్పు చేసిన వారి పేర్లు మాత్రమే ఉన్నాయని, తమకు న్యాయం చేస్తారన్న నమ్మకంతోనే ప్రజలు తమను గెలిపించారని అన్నారు. రెడ్ బుక్ వల్లే కూటమి గెలిచిందని చెప్పడం లేదని, అందరి కృషి వల్ల గెలిచామని, అందులో రెడ్ బుక్ కూడా ఒక భాగమని చెప్పారు.