ఉమ్మడి విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక గత కొద్ది రోజుల నుంచి రాష్ట్రంలో హీటు పుట్టిస్తున్న సంగతి తెలిసిందే. తమకు ఉన్న బలం దృష్ట్యా ఈ ఎన్నికలో ఎలాగైనా గెలవాలని వైసీపీ వ్యూయాలు రచిస్తోంది. ఇప్పటికే మాజీ మంత్రి బొత్స సత్యనారాయణను తమ అభ్యర్థిగా ప్రకటించింది. ఎన్నికల్లో భాగంగా సోమవారం ఆయన నామినేషన్ కూడా దాఖలు చేశారు
అయితే అనూహ్యంగా విశాఖ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోటీకి టీడీపీ-బీజేపీ-జనసేన కూటమి దూరంగా ఉండాలని నిర్ణయించుకుంది. టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయడు సూచనతో కూటమి నేతలు ఈ నిర్ణయం తీసుకున్నారు. విశాఖ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, మున్సిపల్ కౌన్సిలర్లు, కార్పొరేటర్లు కలిపి మొత్తం 838 ఓట్లు ఉన్నాయి.
ఇందులో టీడీపీకి 200కు పైగా ఓట్లు ఉండగా.. వైసీపీకి 543కు పైగా ఓట్లు ఉన్నాయని లెక్కలు చెబుతున్నాయి. సరైన బలం లేకుండా పోటీ చేయడం కంటే ఎన్నికలకు దూరంగా ఉండటమే మంచిదని టీడీపీ అధినాయకత్వం నిర్ణయించింది. మంగళవారం నాడు టెలికాన్పరెన్స్లో చంద్రబాబు తన నిర్ణయాన్ని కూటమి నేతలకు తెలిపారు. ఒక ఎమ్మెల్సీ సీటు కోసం ప్రయాస పడి గెలవాల్సిన అవసరం లేదని.. ప్రభుత్వం ముందున్న లక్ష్యం రాష్ట్ర పునర్నిర్మాణం, అన్ని వర్గాల అభివృద్ధి అని చంద్రబాబు ఎంతో హుందాగా తెలియజేశారు. ఇక ఉప ఎన్నికకు కూటమి దూరంగా ఉంటే.. బొత్స గెలుపు లాంఛనమే అవుతుంది.