తాను ఏపీకి సీఎం అయినా కూడా సామాన్యుడినే అని నారా చంద్రబాబు నాయుడు మరోసారి నిరూపించుకున్నారు. తన వ్యవహార శైలితో ఎక్కడికి వెళ్లినా అందరినీ ఆకట్టుకుంటున్న ఆయన.. తాజాగా గిరిజన మహిళలతో కలిసి స్టెప్పులు వేశారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన వేడుకల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు.
మంత్రి గుమ్మడి సంధ్యారాణి, స్థానిక ఎమ్మెల్యేలు చంద్రబాబుకు ఘన స్వాగతం పలికారు. అనంతరం గిరిజన మహిళలతో కలిసి ఆయన సంప్రదాయ నృత్యం చేశారు. అలాగే కళాకారుల డప్పు తీసుకుని చంద్రబాబు స్వయంగా వాయించి అందర్నీ ఉత్సాహపరిచారు. అనంతరం గిరిజన సంప్రదాయమైన కొమ్మ కోయ ధరించడంతో పాటు అరకు కాఫీ రుచి చూశారు.
వివిధ వేషధారణలతో వచ్చిన గిరిజన లంబాడి కళాకారులతో కాసేపు సీఎం ముచ్చటించారు. గిరిజనలు ప్రదర్శించిన ఉత్పత్తుల వివరాలను అడిగి మరీ తెలుసుకున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించి వీడియో సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. కాగా, అంతర్జాతీయ గిరిజన దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని గిరిజన సోదరులకు చంద్రబాబు తన అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా శుభాకాంక్షలు తెలియజేశారు.
`జనజీవన ప్రధాన స్రవంతిలో గిరిజనులు భాగస్వాములు కావాలనేది తెలుగుదేశం పార్టీ మూల సిద్ధాంతాలలో ఒకటి. అందుకే నాటి తెలుగుదేశం హాయంలో వారి విద్య, వైద్యం, జీవన ప్రమాణాల పెంపు కోసం అనేక కార్యక్రమాలు అమలు చేశాం. గిరిజనుల కోసం ప్రత్యేకంగా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అందించాం. అరకు కాఫీకి, గిరిజన ఉత్పత్తులకు అంతర్జాతీయ గుర్తింపుకోసం ప్రోత్సాహాన్ని అందించాం. గిరిజన జాతులను కాపాడుకోవడం అంటే భారతీయ సంస్కృతిని సమున్నతంగా నిలబెట్టడమే. రాబోయే రోజుల్లో కూడా గిరిజన వర్గాలకు అన్ని విధాలుగా ఆసరాగా నిలబడతామని, గిరిజనులకు, వారి బిడ్డలకు మంచి భవిష్యత్ ను అందిస్తామని తెలియజేస్తున్నాను` అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు.
ప్రపంచ ఆదివాసీ దినోత్సవంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. గిరిజన మహిళలతో కలిసి సంప్రదాయ నృత్యం చేసిన ముఖ్యమంత్రి.#NaraChandrababuNaidu #AndhraPradesh pic.twitter.com/XEK06av0c8
— Telugu Desam Party (@JaiTDP) August 9, 2024