ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అధికార పార్టీ వైసీపీ చిత్తుగా ఊడిపోయిన తర్వాత మాజీ ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. వైసీపీ నేతలు ఒక్కొక్కరికీ పార్టీని వీడుతున్నారు. ఇప్పుడు ఈ జాబితాలో మరో కీలక నేత చేరబోతున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది. కాకినాడ జిల్లా పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు వైసీపీకి గుడ్‌బై చెప్పి జనసేనలోకి జంప్ కాబోతున్నారట.
బుధవారం వైసీపీకి దొరబాబు రాజీనామా చేయనున్నారని.. నియోజకవర్గంలో మరికొందరు ముఖ్య నేతలు ఆయన వెంటే నడవబోతున్నారని వార్తలు వస్తున్నారు. బీజేపీ నుంచి 2004 నుంచి 2009 వరకు పిఠాపురం ఎమ్మెల్యేగా ఉన్న దొరబాబు.. 2012లో వైసీపీలో చేరారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో పిఠాపురం నియోజకవర్గం నుండి పోటీ చేసి ఓడిపోయారు. 2019లో జరిగిన ఎన్నికల్లో 14,992 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.
అయితే ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అధినేత జగన్ పిఠాపురం సిట్టింగ్ సీటును దొరబాబుకు కాకుండా వంగా గీతకు కేటాయించారు. పవన్ కళ్యాణ్ తో పోటీ పడిన గీత.. ఓటర్ల దెబ్బకు ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. ఇకపోతే ఎన్నికలకు ముందు జిల్లా పార్టీ అధ్యక్ష పదవి ఇస్తానని దొరబాబుకు మాటిచ్చిన జగన్ చివరకు హ్యాండ్ ఇచ్చారు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన పెండెం దొరబాబు.. వైసీపీని వీడాలని నిర్ణయించుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే తన రాజీనామాపై ముఖ్య నాయకులకు దొరబాబు క్లారిటీ కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది.