2024 సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీయే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఒకవైపు సంక్షేమం మరోవైపు అభివృద్ధిపై దృష్టి సారించిన సంగతి తెలిసిందే. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒకదాని తర్వాత ఒకటి అమలు చేస్తూ వస్తున్నారు. ఇందులో భాగంగానే రాష్ట్ర ప్రజలకు అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పేందుకు సీఎం రెడీ అవుతున్నారని ప్రచారం జరుగుతుంది.
మూడు కీలకమైన పథకాల అమలుకు ఒకే రోజు ముహూర్తం పెట్టబోతున్నారని జోరుగా వార్తలు వస్తున్నాయి. ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఆగస్టు 15న రాష్ట్రంలో అన్న క్యాంటీన్లు ప్రారంభం, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం మరియు అమ్మకు వందనం పథకాలకు చంద్రబాబు అమలు చేయబోతున్నారని అంటున్నారు. ప్రస్తుతం అధికారులు ఆ దిశగా కసరత్తులు చేస్తున్నట్లు సమాచారం అందుతోంది.
2014లో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పేదల ఆకలి బాధలు తీర్చేందుకు అన్న క్యాంటీన్లు తీసుకొచ్చారు. రూ.5కే ఉదయం టిఫిన్, రూ.5కే మధ్యాహ్నం, రూ.5 రాత్రి భోజనం అందించారు. అయితే వైకాపా హయాంలో అన్న క్యాంటీన్లు మూతపడ్డాయి. 2024లో ప్రభుత్వం మారడంతో మూసి వేసిన అన్నా క్యాంటీన్లను తిరిగి ప్రారంభించేందుకు రంగం సిద్ధం చేశారు. అలాగే ఎన్నికల సమయంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఇక ఈ పథకంతో పాటు తల్లికి వందనం పథకాన్ని సైతం ఆగస్టు 15న ప్రారంభించనున్నారని టాక్ నడుస్తోంది.