ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనదైన మార్క్ పాలనతో దూసుకుపోతున్నారు. రాష్ట్రంలో ఓవైపు అభివృద్ధి.. మరోవైపు సంక్షేమాన్ని పరుగులు పెట్టిస్తున్నారు. అలాగే ప్రజల్లో మమేకం అవ్వాలని.. ప్రభుత్వానికి-ప్రజలకు మధ్య గ్యాప్ ను దూరం చేయాలని పార్టీ నేతలకు పదే పదే సూచిస్తున్నారు. మంత్రి నారా లోకేష్ మంగళగిరి నియోజకవర్గంలో భారీ మెజారిటీతో గెలుపొందినప్పటి నుంచీ అదే పనిలో ఉన్నారు.
ఎన్నికల సమయంలో ప్రజల కోసం తన ఇంటి ద్వారాలు ఎప్పుడూ తెరిచే ఉంచుతానని హామీ ఇచ్చిన లోకేష్.. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రజా దర్బార్ పేరుతో సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రతి నిత్యం ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను నేరుగా తెలుసుకుంటున్నారు. ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తూ.. సత్వరమే పరిష్కారమయ్యే సమస్యలను అక్కడిక్కడే పరిష్కరిస్తున్నారు. లోకేష్ ప్రారంభించిన ప్రజా దర్బార్ కార్యక్రమానికి విశేషమైన స్పందన లభిస్తోంది.
లోకేష్ కు తమ సమస్యలను, కష్టాలను చెప్పుకునేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి ప్రజలు తరలివస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రజాదర్బార్ కార్యక్రమాన్ని మరింత విస్తృతంగా నిర్వహించాలని చంద్రబాబు నిర్ణయించారు. ఇందులో భాగంగానే మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో షిఫ్ట్‌లు వారీగా ప్రజా దర్బార్ నిర్వహించాలని..ప్రజల నుంచి వచ్చే వినతిపత్రాలను స్వీకరించి, వారి సమస్యల పరిష్కరించే దిశగా కృషి చేయాలని సీఎం కీలక ఆదేశాలు జారీ చేశారు. ఆగస్టు నెలకు సంబంధించి ముఖ్య నేతలకు మరియు మంత్రులకు ప్రజాదర్బార్ డ్యూటీలు కూడా వేయడం జరిగిందని అంటున్నారు.