ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి దెబ్బ మీద దెబ్బ పడుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘోర ఓటమిని చవిచూడటం, శాసనసభలో ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కకపోవడం వంటి అంశాలతో ఓవైపు జగన్ సతమతం అవుతుంటే..మరోవైపు వైసీపీ నేతలంతా పార్టీని వీడుతూ షాకులు ఇస్తున్నారు. ఇప్పటికే పలువురు వైసీపీ నేతలు టీడీపీలో చేరిపోయారు.
తాజాగా కుప్పంలో వైసీపీకి ఎదురుదెబ్బ తగిలింది. కుప్పం వైసీపీ నేతలు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. బుధవారం ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ ఆధ్వర్యాన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో కుప్పం మున్సిపాలిటీకి చెందిన ఐదుగురు కౌన్సిలర్లు, 15 మంది ఎంపీటీసీలు వైసీపీకి గుడ్‌బై చెప్పి టీడీపీలో చేరారు.
అభివృద్ధి చేస్తామని మాటతప్పిన వైసీపీలో ఇమడలేక.. గత నెలన్నర రోజుల నుంచి చంద్రబాబు నాయకత్వంలో సాగుతున్న అభివృద్ధి చూసి పసుపు కండువ కప్పుకున్నట్లు స్థానిక ప్రజాప్రతినిధులు చెబుతున్నారు. ఇక కుప్పం నియోజకవర్గానికి చెందిన మరికొందరు వైసీపీ కీలక నేతలు టీడీపీలో చేరబోతున్నారని ఈ సందర్భంగా ఎమ్మెల్సీ శ్రీకాంత్ తెలియజేశారు. ఎవరైతే కుప్పం అభివృద్ధిని కోరుకుంటున్నారో వారందరినీ టీడీపీలోకి ఆహ్వానిస్తామని పేర్కొన్నారు.