ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం నుంచి తీపి కబురు అందింది. ఈ రోజు పార్లమెంట్లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్ బడ్జెట్ 2024-25ను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. అయితే ఈ వర్షిక బడ్జెట్ లో ఏపీ కి వరాలు కురిపించారు. ఏపీ అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తామని నిర్మలా సీతారామన్ తెలిపారు. విభజన చట్టంలో పేర్కొన్న అన్ని అంశాలను అమలు చేస్తామని హామీ ఇచ్చారు.
విభజన హామీలు, రాజధాని అవసరాన్ని గుర్తించి ప్రత్యేక ఆర్థిక సహకారం అందించనున్నట్లు ఆమె ప్రకటించారు. 2024-25 బడ్జెట్లో ఏపీ రాజధాన్ని అమరావతి అభివృద్ధి కోసం రూ.15వేల కోట్ల నిధులు కేటాయించనున్నట్లు నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. విభిన్న ఏజెన్సీల సహకారంతో నిధులు సమకూర్చుతామని వివరించారు.
అలాగే ఏపీ జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడానికి కేంద్రం సహకరిస్తుందని.. పరిశ్రమల ఏర్పాటు కోసం ప్రత్యేక రాయితీలు ఇస్తామని నిర్మలా సీతారామన్ వెల్లడించారు. విశాఖ-చెన్నై ఇండస్ట్రీయల్ కారిడర్ అభివృద్ధికి నిధులు మంజూరు చేస్తామని నిర్మలమ్మ తెలిపారు. ఇవి కాకుండా రాయలసీమ, ప్రకాశం, ఉత్తరాంధ్రకు నిధులు ఇస్తామని.. విభజన చట్టంలో పొందుపర్చినట్లుగా వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక ఆర్థిక సహాయం అందించనున్నట్లు ఆమె పేర్కొన్నారు.