భావోద్వేగాలకు కారణమయ్యే కీలక నిర్ణయాల్ని ప్రకటించే వేళలో.. లాభనష్టాల మదింపు చాలా కచ్ఛితంగా జరగాలి. అందునా.. ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలతో ఎంతవరకు సెంటిమెంట్లు.. భావోద్వేగాల మీద ప్రభావం చూపుతుందనే విషయం ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోవాలి. ఈ మదింపు విషయంలో ఏ మాత్రం తేడా కొట్టినా మొదటికే మోసం వస్తుంది. తాజాగా అలాంటి పరిస్థితినే ఎదుర్కొంటోంది కర్ణాటకలోని సిద్దరామయ్య సర్కారు. ఏదో చేయాలన్న ఉద్దేశంతో తీసుకొచ్చిన ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగాల్లో స్థానికులకు ప్రాధాన్యత ఇచ్చే బిల్లు బ్యాక్ ఫైర్ అయ్యింది.
చట్టసభలో ఈ బిల్లును ప్రవేశ పెట్టాలనుకోవటం… వెంటనే ఆ పని చేయడంతో దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. అయితే తీవ్ర వ్యతిరేకతతో కర్ణాటక కాంగ్రెస్ సర్కారు కాస్తంత వెనక్కి తగ్గటం తెలిసిందే. ప్రభుత్వం ప్రతిపాదించిన అంశాల్ని చూస్తే.. కంపెనీల పాలన విభాగంలో యాభై శాతం.. గ్రూప్ సీ, డీ ఉద్యోగాల్లో వంద శాతం కొలువుల్ని కన్నడిగులకే కేటాయించాలన్న ఆలోచనను తెర మీదకు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు.ఈ ప్రతిపాదనపై కొన్ని మౌలిక ప్రశ్నలు సంధిస్తున్నారు. దీంతో.. ఈ ప్రతిపాదనపై సిద్ధరామయ్య సర్కారు వెనక్కి తగ్గింది. అయినప్పటికీ.. వారి ఆలోచనలపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
పలు వాదనల్ని తెర మీదకు తీసుకొస్తున్నారు. ఆ కోవలోకి వస్తారు ఫోన్ పే సీఈవో సమీర్ నిగమ్.
కర్ణాటక సర్కారు ప్రతిపాదనను ఆయన తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తల్లిదండ్రుల ఉద్యోగాల్లో భాగంగా వారి పిల్లలు వివిధ రాష్ట్రాల్లో చదువుకున్న విద్యార్థులు తీవ్రంగా నష్టపోతారన్నారు. తాను స్థాపించిన సంస్థల ద్వారా దేశ వ్యాప్తంగా పాతిక వేల మందికి పైగా కొలువుల్ని కల్పించానని.. ఉద్యోగరీత్యా వివిధ రాష్ట్రాల్లో తాను ఉంటున్నట్లు పేర్కొన్నారు. తన వయసు ప్రస్తుతం 46 ఏళ్లు గా చెప్పిన సమీర్.. ‘‘ఇప్పటివరకు ఒక్క రాష్ట్రంలో కూడా పదిహేనేళ్లకు మించి నివసించలేదు. అలా అని కర్ణాటకలో పుట్టి పెరిగిన నా పిల్లలు.. ఇక్కడ ఉద్యోగం చేసేందుకు అర్హులు కారా?’’ అంటూ సూటిగా ప్రశ్నించారు.
తన తండ్రి ఇండియన్ నేవీలో పని చేశారని.. దేశ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో విధులు నిర్వర్తించారని.. ఆయన పిల్లలకు కర్ణాటకలో జాబ్ చేసే అర్హత లేదా? అని ప్రశ్నిస్తున్నారు. వంద శాతం ఉద్యోగాలను కన్నడిగులకే ఇవ్వాలనే సంస్థల ప్రతినిధులను విమర్శిస్తున్నారు. వంద శాతం జాబ్ లను కన్నడిగులకు ఇవ్వాలనే దిశగా ప్రభుత్వం ఆలోచిస్తున్న వైనం అన్ని ప్రైవేటు సంస్థలు వ్యతిరేకిస్తున్నాయి. ఈ తరహా నిర్ణయం అన్ని రాష్ట్రాలు.. దేశాలు తీసుకుంటే కన్నడిగులు అన్నింటిని వదిలేసి.. వారే చివరకు కర్నాటకకు తిరిగి రావాల్సి ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
మొత్తంగా చూసినప్పుడు ఏయే అంశాల్ని అయితే ప్రస్తావించకూడదో.. వాటినే టచ్ చేసిన సిద్దూ సర్కారుకు పలువురు ప్రముఖులు సంధిస్తున్న ప్రశ్నలకు సమాధానం చెప్పలేక కిందా మీదా పడుతున్నట్లుగా చెప్పక తప్పదు. మొత్తంగా ప్రైవేటు రంగానికి చెందిన ప్రముఖులు అడుగుతున్న ప్రశ్నలు కర్ణాటక సర్కారును ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయని చెప్పాలి.