ఇటీవల ముగిసిన సార్వత్రిక ఎన్నికలలో ప్రధాని మోడీ హవా తగ్గిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆ ఎన్నికలు ముగిసిన తర్వాత దేశంలోని ఏడు రాష్ట్రాల్లో జరిగిన 13 శాసనసభ స్థానాల్లో బీజేపీకి భంగపాటు ఎదురైంది. 13 స్థానాలకు గాను 11 స్థానాల్లో ఇండియా కూటమి గెలిచింది. ఒక్క స్థానంలో గెలిచిన బీజేపీ మరో స్థానంలో స్వల్ప ఆధిక్యతలో ఉంది.
మధ్యప్రదేశ్‌లోని అమర్వాడా, పంజాబ్‌లోని జలంధర్ వెస్ట్, హిమాచల్ ప్రదేశ్‌లోని డేహ్రా, హమీర్పూర్, నాలాగఢ్, బెంగాల్‌లోని రాయ్‌గంజ్, రాణాఘాట్ దక్షిణ్, బాగ్డా, మాణిక్తలా, తమిళనాడులోని విక్రవండి, ఉత్తరాఖండ్‌లోని బద్రీనాథ్, మంగళౌర్, బిహార్‌లోని రూపౌలి మొత్తం 13 శాసనసభ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగాయి.
తాజాగా వెలువడుతున్న ఫలితాల్లో ఇండియా కూటమి దూకుడు ప్రదర్శిస్తుంది. బీహార్ లో రూపౌళి స్థానంలో స్వతంత్ర అభ్యర్థి శంకర్ సింగ్ జేడీ (యూ) అభ్యర్థి ప్రసాద్ మండల్ పై 6 వేల పైచిలుకు ఓట్లతో విజయం సాధించాడు. హిమాచల్ ప్రదేశ్ లో ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సతీమణి కమలేష్ ఠాకూర్ బీజేపీ అభ్యర్థి హోషియార్ సింగ్ పై 9399 ఓట్లతో విజయం సాధించింది.
నాలాగార్హ్ లో కాంగ్రెస్ అభ్యర్థి 8990 ఓట్లతో, ఒక్క హమీర్ పూర్ స్థానంలో బీజేపీ అభ్యర్థి కేవలం 1571 స్వల్ప ఓట్లతో విజయం సాధించాడు. పంజాబ్ లో సీఎం భగవంత్ సింగ్ మాన్ కు ప్రతిష్టాత్మకంగా మారిన జలంధర్ వెస్ట్ స్థానం నుండి ఆప్ అభ్యర్థి మొహిందర్ భగత్ 37325 ఓట్లతో విజయం సాధించాడు.
తమిళనాడు విక్రవండి స్థానంలో డీఎంకే అభ్యర్థి శివ షణ్ముగం మరో నాలుగు రౌండ్లు మిగిలి ఉండగానే పీఎంకే అభ్యర్థిపై 54409 ఓట్ల మెజారిటీతో ఉన్నాడు. ఉత్తరాఖండ్ బద్రీనాథ్ లో 5224, మంగ్లౌర్ లో 422 ఓట్ల మెజారిటీతో కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారు.
పశ్చిమబెంగాల్ లోని రాయ్‌గంజ్, రాణాఘాట్ దక్షిణ్, బాగ్డా, మాణిక్తలా టీఎంసీ అభ్యర్థులు నలుగురూ 30 వేల నుండి 60 వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. మధ్యప్రదేశ్ అమర్వరాలో బీజేపీ అభ్యర్థి 1700 ఓట్లు స్వల్ప అధిక్యంలో ఉన్నాడు. ఇంకో రౌండ్ ఉన్న నేపథ్యంలో తుది ఫలితాల కోసం వేచిచూడాలి.