గత వైకాపా పాలనలో సెకండ్ సీఎం గా, రాయలసీమ జిల్లాలకు మకుటం లేని మహారాజులా ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కి సొంత నియోజకవర్గమైన పుంగనూరులో షాకుల మీద షాకులు తగులుతున్నాయి. 2024 ఎన్నికల్లో అధికార పార్టీ వైసీపీ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. ఆ పార్టీకి చెందిన మంత్రులందరిలోనూ ఒక్కడే.. అది కూడా అంతంత మాత్రం మెజార్టీతోనే పెద్దిరెడ్డి పుంగనూరు నియోజకవర్గం నుంచి గెలుపొందారు.
అయితే రాష్ట్రంలో వైసీపీ అధికారం కోల్పోవడంతో పెద్దిరెడ్డి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. గత ఐదేళ్లలో పుంగనూరు గడ్డా.. పెద్దిరెడ్డి అడ్డా అన్నట్లుగా వ్యవహరించిన ఆయన ఇప్పుడు జీరో అయిపోయారు. ఇదే క్రమంలో పుంగనూరు పరిధిలో వైసీపీ ముఖ్యనేతలంతా తమ పదువులకు రాజీనామా చేస్తూ పెద్దిరెడ్డికి షాకులు ఇస్తున్నారు. ఇప్పటికే పుంగనూరు మున్సిపల్ చైర్మన్ అలీంబాషాతో పాటు 12 మంది కౌన్సిలర్లు రాజీనామా చేశారు.
రాజీనామా సమయంలో పెద్దిరెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేశారు. పేరుకే తమకు పదవులు.. పెత్తనం మాత్రం ఆయనే చేశారని కౌన్సిలర్లు మండిపడ్డారు. అయితే ఈ షాక్ నుంచి ఇంకా తేరుకోకముందే పెద్దిరెడ్డికి మరో షాక్ తగిలింది. పుంగనూరు నియోజకవర్గంలోని పులిచెర్ల మండలం జడ్పీటీసీ మురళితో సహా నలుగురు ఎంపీటీసీలు, పది మంది సర్పంచులు వైసీపీ పార్టీకి మరియు తమ పదవులకు రాజీనామా చేశారు. వీరంతా రాజీనామా లేఖలను జిల్లా అధికారులకు అందజేయడమే కాకుండా త్వరలో టీడీపీ కండువాలు కప్పుకోవడానికి రంగం కూడా సిద్ధం చేసుకుంటున్నారు.