ఏపీ ఐటీ శాఖ మంత్రి, తెలుగు దేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వాట్సాప్ అకౌంట్ బ్లాక్ అయింది. మంత్రిగారి వాట్సాప్ ను బ్లాక్ అవ్వడమేంటి..? ఇది హ్యాకర్స్ చేసిన పనా..? అంటే కానే కాదు. వాట్సాప్ మాతృసంస్థ అయిన మెటా స్వయంగా లోకేష్ వాట్సాప్ ను నిలిపివేసింది. తాజాగా ఇందుకు కారణం ఏంటో వివరిస్తూ ఎక్స్ ద్వారా లోకేష్ ఒక పోస్ట్ కూడా పెట్టారు.
రాష్ట్రంలో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీయే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత నారా లోకేష్ చాలా బిజీగా మారారు. ప్రభుత్వంలో చంద్రబాబు తర్వాత లోకేష్ అత్యంత కీలకంగా వ్యవహరిస్తున్నారు. సామాన్య ప్రజానీకం పడుతున్న కష్టాలు, వారి సమస్యల పరిష్కారం కోసం లోకేష్ చేపట్టిన ప్రజాదర్బార్ కు విశేష స్పందన లభిస్తోంది. మరోవైపు వాట్సప్ ద్వారా లోకేష్ ను సంప్రదించే అవకాశం ఉన్న నేపథ్యంలో.. రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు తమ సమస్యలను చెప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
తమకు సహయం కావాలన్నా, ప్రభుత్వం నుండి జరగాల్సిన పని పెండింగ్ లో ఉన్నా ప్రజలు వాట్సాప్ ద్వారా లోకేష్ కు సమాచారం పంపుతున్నారు. అయితే కుప్పలుతెప్పలుగా మెసేజ్లు వెళ్లడంతో మెటా సంస్థ ఆటోమెటిక్ గా అనుమానాస్పద అకౌంట్ గా లోకేష్ వాట్సాప్ ను బ్లాక్ చేసింది. ఇదే విషయాన్ని లోకేష్ ఎక్స్ ద్వారా తెలియజేశారు.
`ప్రజల నుంచి వరదలా వచ్చిన మెసేజ్లతో సాంకేతిక సమస్య తలెత్తి నా వాట్సప్ మెటా బ్లాక్ చేసింది. మీ సమస్యలు దయచేసి నాకు వాట్సప్ చేయొద్దు. మీ సమస్య ఏదైనా, సహాయం కావాలన్నా ఇకనుంచి నా పర్సనల్ మెయిల్ ఐడీ [email protected] పంపించండి. పాదయాత్రలో యువతకు నన్ను చేరువ చేసిన హలో లోకేష్ కార్యక్రమం పేరుతోనే నా మెయిల్ ఐడిని క్రియేట్ చేసుకున్నాను. మీ పేరు, ఊరు, మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి, సమస్య-సహాయంకు సంబంధించిన పూర్తి వివరాలు వినతులలో పొందుపరిచి మెయిల్ చేయండి. మీకు సహాయం చేయడం, సమస్య పరిష్కరించే బాధ్యత నేను తీసుకుంటాను.` అంటూ లోకేష్ తన తాజా ట్విట్ లో పేర్కొన్నారు.