ఏపీ లో కొత్తగా అధికారంలోకి వచ్చిన కూటమి సర్కార్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో వేగంగా నిర్ణయాలు తీసుకుంటోంది. ఇందులో భాగంగానే తాజాగా ఏపీ విద్యార్థులకు గుడ్ న్యూస్ వెల్లడించింది. తల్లికి వందనం పథకం అమలుకు విధివిధానాలు ఖరారు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పథకం ద్వారా ఒకటవ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదివే ప్రతి విద్యార్థికి రూ. 15 వేలు ఆర్థిక సాయం, స్టూడెంట్ కిట్ పంపిణీ చేయబోతున్నారు. రూ. 15 వేలు ఆర్థిక సాయం నేరుగా విద్యార్థి తల్లి అకౌంట్ లోకి జమా చేస్తారు.
ఇందులో భాగంగానే తాజాగా తల్లికి వందనం, స్టూడెంట్ కిట్ ప్రయోజనాలు పొందడానికి కొన్ని గుర్తింపు కార్డులను తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కొత్త ప్రభుత్వంలో పథకాల పేర్లు మారిన నేపథ్యంలో తల్లికి వందనం, స్టూడెంట్ కిట్ పథకాలకు సంబంధించి డబ్బులు పొందాలనుకునే లబ్ధిదారులు కచ్చితంగా ఆధార్ కలిగి ఉండాలని విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ వెల్లడించారు. ఒకవేళ ఆధార్ కార్డు లేనివారు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని కూడా సూచించారు.
అలాగే ఆధార్ కార్డు తో పాటు డ్రైవింగ్ లైసెన్స్, ఫోటో ఉన్న బ్యాంకు లేదా పోస్ట్ ఆఫీస్ పాస్ బుక్, పాన్ కార్డు, రేషన్ కార్డు, ఓటర్ ఐడెంటిటీ కార్డు, ఎంజీఎన్ఆర్ఈజీఏ కార్డు, ఫోటో ఉన్న కిసాన్ కార్డు, గెజిటెడ్ ఆఫీసర్ లేదా తహసిల్దార్ అఫీషియల్ లెటర్ హెడ్, ఏదైనా డిపార్ట్మెంట్ డాక్యుమెంట్ లాంటి మొత్తం పది గుర్తింపు కార్డుల్లో ఏదైనా ఒకటి ఉండాలని ప్రభుత్వం పేర్కొంది.
ఇక తల్లికి వందనం పథకానికి ఎవరెవరు అర్హులు అన్న విషయానికి వస్తే.. దారిద్ర రేఖకు దిగువన ఉండే స్కూళ్లకు పిల్లల్ని పంపించే తల్లులు లేదా సంరక్షకులను ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటుంది. మరియు విద్యార్థులకు 75% హాజరు తప్పనిసరిగా ఉండాలని ప్రభుత్వం పేర్కొంది. తల్లికి వందనం పథకానికి అర్హులైన వారికి ప్రభుత్వం రూ.15వేలుతో పాటు స్టూడెంట్ కిట్ కింద విద్యార్థులకు బ్యాగు, బెల్టు, బూట్లు, సాక్సులు, పాఠ్యపుస్తకాలు, నోట్ పుస్తకాలు, యూనిఫాం అందజేస్తారు.