ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పాలనలో తనదైన మార్క్ చూపిస్తున్నారు. ప్రభుత్వంలో తాను చేపట్టిన పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి, శాస్త్ర సాంకేతిక, అటవీ పర్యావరణ శాఖలపై సుధీర్గంగా సమీక్షలు నిర్వస్తూ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. తాజాగా ప్రకృతి వ్యవసాయ నిపుణుడు, పర్యావరణ ప్రేమికుడు అయిన విజయ రామ్ ను మంగళగిరిలో కలిసి తర్వాత పర్యావరణ కోసం పవన్ గొప్ప నిర్ణయం తీసుకున్నారు.
వినాయక చవితి పండుగ మరికొన్ని రోజుల్లో రానున్న నేపథ్యంలో పర్యావరణహితమైన వస్తువులనే వేడుకలు, ఉత్సవాల్లో వాడాలని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. వినాయక చవితికి ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాల కన్నా మట్టి గణపతి ప్రతిమలను పూజిస్తే పర్యావరణానికి మేలు జరుగుతుంది. నీటి కాలుష్యానికి అడ్డుకట్ట వేయవచ్చు. ఈ విషయంపై ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులకు పవన్ కళ్యాణ్ సూచించారు.
అలాగే ఈ మార్పు పిఠాపురం నియోజకవర్గం నుంచే మొదలు కావాలని.. పిఠాపురంలో మట్టి వినాయకుడి విగ్రహాన్ని పూజించేలా ఏర్పాట్లు చేయాలని పవన్ కళ్యాణ్ ఆదేశాలు జారీ చేశారు. అంతేకాకుండా దేవాలయాల్లో బటర్ పేపర్తో చేసిన కవర్లలో ప్రసాదాలు ఇస్తున్నారని.. కానీ ఇకపై అవి కనిపించకూడదని.. వాటి స్థానంలో చిన్నపాటి తాటాకు బుట్టలు, ఆకులతో చేసిన దొన్నెలు వాడితే అవి వ్యర్థాల నిర్వహణ సులభమవుతుందని పవన్ తెలిపారు. పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న ఆలయాల్లో వీటి వినియోగాన్ని ప్రయోగాత్మకంగా చేపట్టేందుకు కార్యాచరణ మొదలు పెడతామని కూడా పవన్ స్పష్టం చేశారు.