ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి చేతుల్లో చిత్తుచిత్తుగా ఓడిపోయి అధికారాన్ని కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే జగన్ సంచలన నిర్ణయాలు తీసుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. గత ఎన్నికల్లో 151 యొక్క స్థానాల్లో విజయం సాధించిన వైకాపా.. ఈసారి ఎన్నికల్లో కేవలం 11 సీట్లతో సరిపెట్టుకుంది. సరైన సంఖ్యాబలం లేకపోవడం వల్ల అసెంబ్లీలో కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. దీంతో వచ్చే ఐదేళ్లలో కూటమి ప్రభుత్వాన్ని.. మరీ ముఖ్యంగా సీఎం చంద్రబాబును ఎదిరించి నిలబడడం కష్టమని జగన్ భావిస్తున్నారట.
ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యేగా రాజీనామా చేసి.. ఎంపీ గా పోటీ చేసేందుకు జగన్ సిద్ధం అవుతున్నారంటూ వైసీపీ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. ఎన్నికల్లో వైసీపీ గెలిచిన 11 సీట్లలో జగన్ సొంత నియోజకవర్గం పులివెందుల ఒకటి. ఈ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి రవీంద్రనాథ్ రెడ్డి పై 60 వేల పైచిలుకు ఓట్ల మెజారిటీతో పులివెందుల నుంచి జగన్ గెలుపొందారు. అయితే ఇప్పుడు పులివెందుల ఎమ్మెల్యే స్థానానికి జగన్ రాజీనామా చేయబోతున్నారట.
అదేవిధంగా తన సోదరుడు, కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తో కూడా రాజీనామా చేయించి.. కడప ఎంపీ స్థానానికి ఉప ఎన్నికల్లో పోటీ చేసే ఆలోచనలో జగన్ ఉన్నారంటూ జోరుగా వార్తలు వస్తున్నాయి. ఇక పులివెందుల స్థానానికి జరిగే ఉప ఎన్నికల్లో సతీమణి వైఎస్ భారతి లేదా తల్లి విజయలక్ష్మిలను పోటీ చేయించాలని ఏపీ మాజీ సీఎం ప్లాన్ చేస్తున్నారట.
అలాగే వైసీపీ రాష్ట్ర పగ్గాలను భారతికి అప్పగించి.. ఢిల్లీకే పరిమితం అయ్యేలా కూడా జగన్ ప్రణాళికలు రచిస్తున్నారట. ఎంపీగా ఉంటే ఢిల్లీ రాజకీయాల్లో కీలకం కావచ్చని.. పైగా తనపై నమోదైన అక్రమాస్తుల కేసులను కూడా మేనేజ్ చేసుకునే అవకాశం ఉంటుందని జగన్ యోచిస్తున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.