జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 2024 ఎన్నికల్లో పిఠాపురం నియోజకవర్గం నుంచి తొలిసారి శాసనసభకు ఎన్నికైన సంగతి తెలిసిందే. అసెంబ్లీ గేటు కూడా తాకలేవని పవన్ కళ్యాణ్ ని వైకాపా నేతలు హేళన చేస్తే.. పిఠాపురం నియోజకవర్గ ప్రజలు ఏకంగా ఆయనను రాష్ట్రానికే ఉపముఖ్యమంత్రిని చేశారు. ఈ గెలుపు అందించిన ప్రజల రుణం తీర్చుకునేందుకు పవన్ కళ్యాణ్ నడుము బిగించారు. పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధికి శ్రీకారం చుట్టారు.
అలాగే ఇప్పుడు పిఠాపురాన్ని తన సొంత ఊరిలా మార్చుకుంటున్నారు. అక్కడ సొంతిళ్లు నిర్మించుకునేందుకు సిద్ధమయ్యారు. ఇందుకోసం మూడున్నర ఎకరాల స్థలాన్ని పవన్ కళ్యాణ్ కొనుగోలు చేయడం జరిగింది. పిఠాపురం మండలంలోని భోగాపురం, ఇల్లింద్రాడ రెవెన్యూ పరిధిలో 1.44 ఎకరాలు, 2.08 ఎకరాల రెండు బిట్లు పవన్ కొన్నారు. పిఠాపురంలో ఎకరం భూమి ధర రూ.16-20 లక్షల మధ్య ఉంది. కాబట్టి మూడున్నర ఎకరాలను పవన్ రూ. 70 లక్షలకు కొనుగోలు చేసి ఉండొచ్చని అంటున్నారు.
ఇకపోతే బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు రిజిస్ట్రేషన్ జరిగింది. త్వరలోనే ఆ స్థలంలో నిర్మాణ పనులు సైతం ప్రారంభం కానున్నాయి. రెండు ఎకరాల్లో క్యాంపు ఆఫీసు మరియు మిగిలిన స్థాలంలో ఇల్లు కట్టుకుని పవన్ కళ్యాణ్ నివసించబోతున్నారు. పిఠాపురంలోనే ఇల్లు నిర్మించుకుని ఉంటానని, ప్రజలకు ఎల్లప్పుడూ అండంగా నిలుస్తానని పవన్ కళ్యాణ్ మాటిచ్చారు. అలాగే పిఠాపురం ప్రజలు ఎప్పుడు వచ్చినా వారి సమస్యలు వినేందుకు తగిన సిబ్బందిని కూడా పవన్ ప్రత్యేకంగా నియమించుకున్నారు.