ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేడు పింఛన్ల పండుగ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఎన్డీయే ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత ఏపీలో మొదటిసారి ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం జరుగుతోంది. సోమవారం ఉదయం మంగళగిరి నియోజకవర్గం పెనుమాక గ్రామంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు నాయుడు స్వాయంగా ప్రారంభించారు. ఎస్సీ కాలనీలో ఇంటింటికి తిరుగుతూ లబ్ధిదారులకు పింఛన్లు అందించారు.
అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన ప్రజా దర్భార్ వేదికకు సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ సహా పలువురు నేతలు హాజరు అయ్యారు. స్థానిక ప్రజలతో సమావేశమై వారి సమస్యలను తెలుసుకున్నారు. అయితే ఈ సభలో చంద్రబాబు, లోకేశ్ మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. సభలో లోకేశ్ మాట్లాడుతూ.. గత ఐదు ఏళ్లుగా పరదాల ముఖ్యమంత్రిని చూశాం.. ఇప్పుడు ప్రజల ముఖ్యమంత్రిని చూశామని అన్నారు. ఈ క్రమంలో అధికారులు ఇంకా పరదాలు కడుతున్నారు సర్.. వాళ్లు సెట్ అయ్యే సరికి ఇంకా సమయం పడుతుందని అనుకుంటా అంటూ చంద్రబాబును ఉద్దేశిస్తూ లోకేశ్ వ్యాఖ్యానించారు.
అయితే వెంటనే చంద్రబాబు `లేదు సెట్ అయ్యారు` అంటూ సమాధానం ఇచ్చారు. ఇంకా పరదాలు కడుతున్నారు సర్ అని లోకేశ్ మరోసారి అనడంతో.. పరదాలు కట్టినట్లు ఇంకోసారి తమ దృష్టికి వస్తే వారిని సస్పెండ్ చేయడం తప్ప వేరు మార్గం ఉండదు. ఎవ్వరైనా సరే పాత రోజులు మరిచిపోయి కొత్త రోజులు జ్ఞాపకం చేసుకొని ముందుకు పోవాలి. ఒకవేళ కంప్లైట్ వస్తే మాత్రం పనిష్మెంట్ తప్పదంటూ చంద్రబాబు స్పష్టం చేశారు.
ఇంతలో లోకేశ్ కల్పించుకుని `ఐదు సంవత్సరాలు అలవాటు కదా సార్.. కొంచెం టైమ్ పడుతుంది` అని అన్నారు. అందుకు చంద్రబాబు స్పందిస్తూ.. వాళ్లకే కాదు మీరు కూడా కొత్త కల్చర్ కు అలవాటు కావాలి. ఇక టైమ్ ఉండదు. రివర్స్ పోయే బండిని పాజిటివ్ గా నడిపిస్తున్నాం. ఇంక స్పీడ్ పెంచడం తప్ప ఎవరికి వెనక్కుపోయే ఆలోచన ఉండకూడదు.. అలా చేస్తే నేను షాక్ ట్రీట్ మెంట్ ఇవ్వటానికి రెడీగా ఉన్నా. 1995 టైమ్ సీఎంను మరోసారి చూస్తారు. 4.0 / 1995 అప్పటి చరిత్రను గుర్తుపెట్టుకోవాలి.. అప్పుడు నువ్వు కూడా(లోకేశ్ ను ఉద్దేశిస్తూ) కుర్రాడివి.. నీకు కూడా ఐడియా లేదు. హైదరాబాద్ లో స్టార్ట్ అవుతున్నానంటే రాష్ట్రం మొత్తం రెడ్ అలర్ట్ ఉండేది. అంత భయకరంగా చేయను కానీ.. తప్పు చేస్తే మాత్రం వదిలిపెట్టను` అంటూ చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు.