శుక్రవారం ఉదయం నుంచి కొద్ది గంటల పాటు తెలుగు రాష్ట్రాలకు చెందిన చాలామంది ఎక్కువగా చేసిన పని.. ఏపీ అసెంబ్లీలో జరిగిన ప్రమాణస్వీకారాన్ని వీక్షించటం. న్యూస్ చానళ్లు సైతం ఇదే అంశానికి పెద్దపీట వేస్తూ.. లైవ్ లు ఇచ్చాయి. ఏపీ అసెంబ్లీలో జరిగిన పరిణామాల్నిలైవ్ లో చూస్తే.. దానికి తగ్గట్లు చిట్టి వీడియోలను అప్పటికప్పుడు కట్ చేస్తూ సోషల్ మీడియాలో సందడి చేయటం లాంటివి వరుస పెట్టి జరిగిపోయాయి. ఇవన్నీ ఒక ఎత్తు. అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేసిన జనసేనాని పవన్ కల్యాణ్ ఆ తర్వాత ఏం చేశారు? ఆయన ఎక్కడకు వెళ్లారు? లాంటి ప్రశ్నలు వేస్తే సమాధానాలు దొరకవు. టీవీ చానళ్లు కానీ సోషల్ మీడియాలోనూ ఎలాంటి సమాచారం కనిపించదు.
దీనికి సమాధానం వెతికే క్రమంలో వెలుగు చూసిన సమాచారం ఆశ్చర్యానికి గురి చేయటమే కాదు.. ఉప ముఖ్యమంత్రి హోదాలో పవన్ కున్న కమిట్ మెంట్ ఎంతన్న విషయం ముచ్చటసేలా ఉంది. అదేసమయంలో ఆయన తీరు పలువురు సీనియర్ అధికారులను హడలెత్తిస్తుంది. ఎందుకంటే ఆయన అడుగుతున్న ప్రశ్నలు అలా ఉంటున్నాయి మరి. ఎమ్మెల్యేగా అసెంబ్లీలో ప్రమాణస్వీకారం చేసి..ఆ కార్యక్రమం ముగిసిన తర్వాత నేరుగా తన ఛాంబర్ కు వెళ్లిన పవన్ కల్యాణ్.. అక్కడ తన శాఖాధికారులతో రివ్యూ సమావేశాలతో బిజీ అయ్యారు.
పంచాయితీ రాజ్ శాఖకు సంబంధించిన అధికారులతో సమావేశాన్ని నిర్వహించిన పవన్ కల్యాణ్.. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులు.. ఆర్థిక సంఘం నిధులపై ఆరా తీయటంతో ఆ శాఖాధికారులకు షాకింగ్ గా మారింది. దీనికి కారణం పంచాయితీలకు.. స్థానిక సంస్థలకు వెళ్లాల్సిన నిధులను ఇష్టానుసారంగా సీఎఫ్ఎంయస్కు మళ్లించటమే. తాను అడుగుతున్న సూటి ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక నీళ్లు నములుతున్న అధికారుల తీరును ఆయన తప్పు పట్టారు.
కేంద్రం ఇచ్చే నిధులను మళ్లించటం సీరియస్ అంశంగా పేర్కొన్న పవన్.. నిధులను ఏ మేరకు మళ్లించారో తనకు వెంటనే నివేదిక కావాలని అధికారుల్ని ఆదేశించారు. కేంద్రం నుంచి వచ్చిన నిధులు ఎంత? సీఎఫ్ఎంయస్కు ఎంత మళ్లించారు? ఎందుకు మళ్లించారు? ఎవరి ఆదేశాలతో నిధులు మళ్లించారు? అన్న వివరాల్ని తనకు నివేదిక రూపంలో ఇవ్వాలని ఆదేశించారు. ఈ సందర్భంగా గ్రామాల్లో.. పట్టణాల్లో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారుల్ని ఆదేశించారు.
అదే సమయంలో.. గుంటూరు, విజయవాడలో డయేరియా వచ్చి మనుషులు చనిపోవటం ఏమిటంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన పవన్ కు బదులిచ్చిన అధికారులు.. నిధులు లేవని చెప్పటం గమనార్హం. దీంతో.. కేంద్రం నుంచి వచ్చిన నిధులను ఎందుకు మళ్లించారంటూ ప్రశ్నించటంతో అధికారులు సమాధానాలు చెప్పలేకపోయారు. ఇంతకాలం పాలన గురించి పట్టించుకోకుండా.. ఇష్టారాజ్యంగా నడిచిన దానికి భిన్నంగా ప్రతిది రూల్ ప్రకారం జరగాలన్న పవన్ లెక్క అధికారులకు ఒక పట్టాన అర్థం కావట్లేదన్న మాట వినిపిస్తోంది. మొత్తంగా చూస్తే.. పాలనాపరమైన అంశాల్లోకి వెళుతున్న పవన్.. దాని లోతుల్లోకి వెళ్లి.. జరిగిన తప్పుల లెక్కలు తేలుస్తున్నారని చెప్పక తప్పదు.