వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే అక్రమ కట్టడం అంటూ అంతకుముందు తెలుగుదేశం హయాంలో నిర్మించిన ప్రజా వేదిక ను ఎలా కూల్చేశారో తెలిసిందే. నిజంగా అమరావతిలో అక్రమ కట్టడాలన్నీ కూల్చే ఉద్దేశమే ఉంటే.. ఆ పని ఆ తర్వాత కూడా కొనసాగించి ఉండాలి. అసలు ప్రజావేదిక ఎలా అక్రమ కట్టడం అన్నది కూడా వివరించకుండానే దాన్ని కూల్చి పడేశారు.
ఐదేళ్ల పాటు దాని తాలూకు శిథిలాలను కూడా తొలగించకుండా అలాగే ఉంచేశారు. వైసీపీ ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకత పెంచిన అంశాల్లో ఇదొకటి. ఐతే ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రాగానే రుషికొండ మీద ఏకంగా రూ.550 కోట్లతో జగన్ కోసం నిర్మించుకున్న విలాసవంతమైన భవనాల మీద పెద్ద చర్చ నడుస్తోంది. జాతీయ స్థాయిలో ఈ విషయం హైలైట్ అవుతూ.. జగన్కు చాలా చెడ్డ పేరు తెచ్చి పెడుతోంది.
ఐతే ఈ భవనాల విషయంలో వైసీపీ ఎంత సమర్థించుకుందామని చూసినా ఫలితం లేకపోతోంది. ఈ క్రమంలో వైసీపీ అనుకూల మీడియా సాక్షిలో పెట్టిన ఓ చర్చ అందరికీ మైండ్ బ్లాంక్ అయ్యేలా చేస్తోంది. రుషికొండ మీద నిర్మించిన భవనాలు అప్పటి సీఎం జగన్ కోసమే అని నొక్కి వక్కాణించిన మంత్రులు.. ఇప్పుడు అవి టూరిజం కోసం, అతిథుల కోసం నిర్మించిన భవనాలని బుకాయిస్తున్నారు. సాక్షి మీడియా చర్చా వేదికలో కూడా వైసీపీ ప్రతినిధులు ఇలాగే చెప్పుకున్నారు. అది చాలదన్నట్లు ప్రజావేదిక గురించి ఒక వైసీపీ అనుకూల మేధావి చేసిన వ్యాఖ్య వింటే షాకవ్వాల్సిందే.
ప్రజావేదికను రూ.900 కోట్లు పెట్టి నిర్మించినట్లు ఆయన చెప్పగా.. న్యూస్ ప్రెజెంటర్ సహా అక్కడున్న వాళ్లు ఎవ్వరూ వారించే ప్రయత్నం చేయలేదు. ఒక చిన్న భవనానికి 900 కోట్లు ఎలా ఖర్చవుతాయనే కనీస పరిజ్ఞానం లేకుండా సదరు వ్యక్తి ఆ కామెంట్ చేస్తే సాక్షి దాన్ని అలాగే ప్రసారం చేసింది. వాస్తవానికి ప్రజావేదికకు రూ.9 కోట్ల దాకా ఖర్చయినట్లు వార్తలు వచ్చాయి. ఐతే ఏపీ ఫ్యాక్ట్ చెక్ పేరుతో నడుస్తున్న ప్రభుత్వ హ్యాండిల్ మాత్రం దాని ఖర్చు రూ.2 కోట్ల లోపే అని వివరణ ఇచ్చింది.