ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువు తీరింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఊహకు అందని నిర్ణయాలు తీసుకుంటూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. తాజాగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా విశాఖ జిల్లా గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు యాదవ్ ను నియమిస్తూ ఉత్తరువులు జారీ చేశారు. ఇప్పటివరకు టీడీపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడిగా కింజరాపు అచ్చెన్నాయుడు ఉన్నారు. అయితే ప్రస్తుతం క్యాబినెట్ లో ఆయనకు చోటు దక్కడంతో.. అచ్చెన్నాయుడు స్థానాన్ని గత నాలుగేళ్ల నుంచి విశాఖపట్నం జిల్లా తెదేపా అధ్యక్షుడు గా ఉన్న పల్లా శ్రీనివాసరావు తో భర్తీ చేశారు.
ఇటీవల జరిగిన ఎన్నికల్లో రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీ(95,235 ఓట్లు)తో గాజువాక నుంచి పల్లా శ్రీనివాసరాజు గెలుపొందారు. అయితే పార్టీలో ఎంతోమంది సీనియర్లు ఉన్నప్పటికీ వారందరినీ కాదని చంద్రబాబు ఏరి కోరి పల్లా శ్రీనివాసరావుని రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలోనే పల్లా శ్రీనివాసరావు ఎవరు.. రాష్ట్ర రాజకీయాల్లో ఆయన పాత్ర ఏంటి.. వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
పల్లా శ్రీనివాసరావు యాదవ్ స్వస్థలం స్వస్థలం విశాఖలోని గాజువాక. 1969లో మధ్య తరగతి కుటుంబంలో జన్మించిన ఆయన.. 1995 లో ఎంబిఏ, 1998 లో మాస్టర్ ఆఫ్ టెక్నాలజీ ఇన్ స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ పూర్తి చేశారు. ఆయన తండ్రి సింహాచలం 1984 నుంచి టీడీపీలో ఉన్నారు. 1994-1999 వరకు ఎమ్మెల్యేగా పని చేశారు. స్టడీస్ అనంతరం తండ్రి బాటలోనే శ్రీనివాసరావు కూడా రాజకీయాలపై దృష్టి సారించారు. 2008లో మెగాస్టార్ చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో చేరి ఆయన తన రాజకీయా ప్రస్థానాన్ని మొదలు పెట్టారు.
2009లో ప్రజారాజ్యం పార్టీ తరఫున విశాఖ లోక్ సభ స్థానానికి పోటీ చేసిన పల్లా శ్రీనివాసరావు.. పురంధేశ్వరి చేతిలో ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత ప్రజారాజ్యం పార్టీని చిరంజీవి కాంగ్రెస్ లో విలీనం చేయగా.. పల్లా శ్రీనివాసరావు టీడీపీలో చేరారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు తెలుగు దేశం పార్టీ కోసమే పని చేశారు. మంచి వ్యక్తిత్వంతో గాజువాక ప్రజలకు చేరువై 2014 ఎన్నికల్లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2019 ఎన్నికల్లో ఫ్యాన్ గాలి గట్టిగా వీడియంతో రెండోసారి ఓటమి పాలయ్యారు.
వైకాపా ప్రభుత్వం అధికాంలోకి వచ్చాక పల్లా శ్రీనివాసరావు మరియు అతని కుటుంబం చాలా ఇబ్బందులు పడ్డారు. తమ పార్టీలో చేరాలంటే వైకాపా నాయకులు శ్రీనివాసరావును తీవ్ర ఒత్తిడికి గురి చేశారు. మాట వినకపోవడంతో నిర్మాణం పూర్తి చేసుకున్న ఆయన వాణిజ్య భవనాన్ని అక్రమంగా కూల్చివేశారు. మరోవైపు ఆంధ్ర విశ్వవిద్యాలయంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా వర్క్ చేస్తున్న ఆయన భార్య లావణ్య దేవిని సైతం సస్పెండ్ చేయించారు. అయినా సరే శ్రీనివాసరావు మాత్రం మనసు మార్చుకోలేదు. టీడీపీ వదల్లేదు. జిల్లాలో పార్టీని బలోపేతం చేసుకుంటూ ముందుకు సాగారు.
అన్నివేళలా ప్రజలకు అందుబాటులో ఉంటూ అండగా నిలిచారు. విశాఖ జిల్లాలో టీడీపీ తిరుగులేని శక్తిగా మార్చారు. 2024 ఎన్నికల్లో గాజువాక నుంచి కూటమి అభ్యర్థిగా బరిలోకి దిగి.. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ను బంపర్ మెజారిటీతో ఓడించారు. పల్లా శ్రీనివాసరావు సేవలను గుర్తించిన చంద్రబాబు.. అధికారికంగానే రాగానే ఆయనకు ఏపీ టీడీపీ అధ్యక్షుడి పదవిని కట్టబెట్టారు.