మరి కొద్ది గంటల్లో తిరుపతి ఉప ఎన్నిక పోలింగ్ మొదలు కాబోతోన్న నేపథ్యంలో ఏపీలో రాజకీయ వాతారణం రసవత్తరంగా మారింది. తిరుపతిలో రోడ్ షో నిర్వహిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబుపై రాళ్లదాడి, వైసీపీ అభ్యర్థి గురుమూర్తి మతం వ్యవహారం, ఎన్నికల్లో వార్డు వాలంటీర్ల ప్రలోభాలు వంటి అంశాలు ఉత్కంఠ రేపుతున్నారు. ఈ వ్యవహారాలపై ఈసీకి విపక్షాల ఫిర్యాదులు….వాటిపై ఈసీ స్పందన ఆసక్తికరంగా మారింది.
ఈ నేపథ్యంలోనే పోలింగ్‌కు ఒక్క రోజు ముందు తిరుపతిలో వైసీపీకి డబుల్ షాక్ తగిలేలా కనిపిస్తోంది. చంద్రబాబుపై జరిగిన రాళ్ల దాడి వ్యవహారంలో కఠిన చర్యలు తీసుకోవాలని, వాలంటీర్లను ఎన్నికలకు దూరంగా ఉంచాలని టీడీపీ ఎంపీలు చేసిన ఫిర్యాదునకు కేంద్ర ఎన్నికల సంఘం స్పందించింది. చంద్రబాబుపై రాళ్ల దాడి ఘటనపై దర్యాప్తు చేపడుతున్నట్లు టీడీపీ నేతలకు సీఈసీ సమాధానం పంపింది.
ఈ దర్యాప్తు కోసం ప్రత్యేక పోలీసు అధికారిని నియమిస్తామని సీఈసీ అధికారులు తెలిపారు. రాళ్లదాడి జరగలేదని చెబుతోన్న ఏపీ పోలీసులను, ఏపీ సర్కార్ ను ఈ వ్యవహారం ఇరకాటంలో పడేసింది. ఇక, వాలంటీర్లను ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలని కూడా కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు ఆదేశించారు. అభ్యర్ది తరఫున ఏజెంట్లుగా కూడా వాలంటీర్లను ఉంచొద్దని ఆదేశించారు. దీంతో, పోలింగ్ కు కొద్ది గంటల ముందు వైసీపీ రెండు గట్టి ఎదురు దెబ్బలు తగిలినట్లయింది.