2024 సార్వత్రిక ఎన్నికల్లో దేశవ్యాప్తంగా ఎన్డీఏ హవా కొనసాగుతుందని మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసిన సంగతి తెలిసిందే. ఆ అంచనాలు ఏ మాత్రం తప్పు కాదంటూ తాజాగా వెలువడిన అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నిరూపించాయి. అరుణాచల్ ప్రదేశ్ లో బీజేపీ అధికారాన్ని నిలబెట్టుకోగా, సిక్కింలో ఎస్కేఎమ్ పార్టీ (సిక్కిం క్రాంతికారీ మోర్చా) మరోసారి అధికార పీఠాన్ని చేజిక్కించుకుంది.
అరుణాచల్ ప్రదేశ్ లో మొత్తం 60 సీట్లకు గాను బీజేపీకి 46, ఎన్పీపీకి 5, ఎన్సీపీకి 3, పీపీఏకి 2, కాంగ్రెస్ కు 1, ఇండిపెండెంట్ అభ్యర్థులకు 3 స్థానాలు వచ్చాయి. ఎన్నికలకు ముందే 10 సీట్లు బీజేపీకి ఏకగ్రీవం కావడంతో మిగిలిన 50 స్థానాలకు పోలింగ్ నిర్వహించారు. ఇక, సిక్కింలో మొత్తం 32 స్థానాలకు గాను అధికార ఎస్కేఎమ్ పార్టీ 31 స్థానాలతో తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. ఎంతో ఘన చరిత్ర ఉన్న సిక్కిం డెమోక్రటిక్ ఫ్రంట్ (ఎస్డీఎఫ్) కేవలం ఒక్క స్థానంతో ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది.
తాజాగా అరుణాచల్ ప్రదేశ్ లో బీజేపీ గెలవడంతో ఎగ్జిట్ పోల్స్ ఎగ్జాక్ట్ పోల్స్ గా మారే చాన్స్ ఉందని, కాబట్టి, దేశవ్యాప్తంగా ఎన్డీఏ కూటమి గెలుపు ఖాయమని బీజేపీ శ్రేణులు, ఎన్డీఏ కూటమిలోని పార్టీల శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఏపీలో కూడా ఎన్డీఏ గెలుపు ఎగ్జిట్ పోల్స్ లో చెప్పినట్లే ఖాయమని, చంద్రబాబు మూడోసారి సీఎం కావడం ఖాయమని టీడీపీ నేతలు అంటున్నారు.